వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆస్తులు మాత్రమే చూసుకున్నారా? రాజకీయ భవిష్యత్తు సంగతి ఆయన ఆలోచించుకోలేదా ? ఆస్తులు పదిలంగా ఉంటే చాలు రాజకీయంగా ఎలాంటి నష్టం ఎదురైనా పర్వాలేదు- అని తెగించి తల్లికి ఇచ్చిన షేర్ల గురించి పిటిషన్ వేశారా? దానివలన ఎంతగా భ్రష్టు పట్టిపోతారో, ప్రజలలో ఎంతగా చులకన అవుతారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి!
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత. ఒక రాష్ట్రానికి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రముఖుడు. కేవలం కొన్ని పదుల కోట్ల.. మహా అయితే అంతకంటే కొంత ఎక్కువ విలువ ఉండగల షేర్ల కోసం ఇలా బజారుకెక్కుతారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కాకపోయి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండే వారో కూడా తెలియదని.. ఆయన కొడుకు కావడం వలన దక్కిన ఆస్తులలో కూతురు కు వాటాలు ఇవ్వడానికి ఇంతగా మొండిపట్టు పట్టడం ద్వారా ప్రజలలో చులకన అవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కావాలని కోరుకోవచ్చు గానీ, రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కనీసం ఎంపీ కావాలని కోరుకోకూడదా ఆమెకు ఒక అవకాశం ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది? ఆ అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టడమే జగన్ చేసిన తొలి తప్పు, ఆమెని శత్రువుగా తానే తయారు చేసుకుని చివరికి ఆమె దెబ్బకు తట్టుకోలేక ఆమెకి ఇచ్చిన ఆస్తులు వాటాల కోసం ఇలా చవకబారుగా బజారుకెక్కడం బాగాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చెల్లెలుకు ఇచ్చిన ఆస్తులు వాటాలను తిరిగి తీసుకోవడం కోసం న్యాయపోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో గౌరవం తగ్గిపోతుంది అని.. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడనే అభిప్రాయం కూడా ప్రజలకు ఏర్పడుతుందని అందరూ అనుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభావం చాలా ఉంటుందని కార్యకర్తలు శ్రేణులు భయపడుతున్నారు. జగన్ ఇంటి గొడవ వలన పార్టీకి నష్టం జరిగితే తామంతా మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అనేక రకాల సంక్లిష్టతలను లెక్కచేయకుండా.. పార్టీని పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఇలాంటి దూకుడైన నిర్ణయం తీసుకున్నారని చెల్లెలితో ఆస్తుల తగాదాలపై.. న్యాయపోరాటానికి దిగడం ఏరకంగానూ సమర్ధనీయం కాదని అందరూ అంటున్నారు.