ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు కూడా లేదనే అభిప్రాయానికి వచ్చిన ఎంపీలు పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేయడంతో ఏర్పడిన దుస్థితి ఇది. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎంపీ ఎన్నికలను మొత్తంగా ఎన్డీయే కూటమి పార్టీలు గెలుచుకోవడం గ్యారంటీ. అయితే ఈ మూడు స్థానాలను కూడా ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తీసుకోనున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పదవులకు రాజీనామాలు చేశారు. దాంతో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. వీరిలోనూ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆర్.కృష్ణయ్య ఇప్పటిదాకా ఏ పార్టీలోనూ చేరలేదు. బీసీ సంఘాల జాతీయ నాయకుడిగానే, బీసీలకు రాజకీయ కోటా ఉండాలనే డిమాండ్లతో పోరాటాల గురించి మాత్రమే ఆయన పనిచేస్తున్నారు. వైసీపీని వదలిన తర్వాత ఆయన వేరే పార్టీలో చేరలేదు.
చంద్రబాబునాయుడు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులకు వాళ్లు రాజీనామా చేసినప్పుడే మళ్లీ ఎంపీగా అవకాశం కల్పించడం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చినట్టుగా ఒక పుకారు ప్రచారంలో ఉంది. చంద్రబాబునుంచి ఆ హామీ పొందిన తర్వాత మాత్రమే వారు రాజీనామాలు చేసినట్టు సమాచారం. అంటే ఇప్పుడు ఉప ఎన్నక జరుగుతున్న మూడు స్థానాల్లో రెండు ఆల్రెడీ బుక్ అయినట్టే. మిగిలిన ఒక స్థానాన్ని మాత్రం ఎవ్వరికి కేటాయిస్తారు అనేది కీకలమైన విషయంగా మారుతోంది.
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎంపీ పదవిని కోరుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. ప్రధానంగా మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ఈ జాబితాలో ముందున్నట్టుగా సమాచారం. అదే సమయంలో గతంలో గుంటూరు లోక్ సభ ఎంపీగా గెలిచి.. 2024 ఎన్నికల నాటికి పూర్తిగా రాజకీయాలకు దూరం అయిన గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ ఎంపీ పదవిని కోరుకుంటున్నట్టుగా సమాచారం. ఇంత ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అయిన మూడు స్థానాల్లో జనసేన, బిజెపిలకు ఎన్డీయే కూటమి భాగం ఇవ్వకపోవచ్చునని, ఈసారి ఖాళీ అయ్యే సీట్లలో మాత్రం వారికి సీట్లు వాటా పంచవచ్చునని విశ్లేషణలు సాగుతున్నాయి.