వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పదవీకాలంలో.. చేపట్టిన ఏకైక నిర్మాణాత్మక పని.. విశాఖపట్నం రుషికొండకు బోడి కొట్టేసి.. అక్కడ తన నివాసం కోసం అత్యంత విలాసవంతమైన భవనాలను ప్రభుత్వం సొమ్ముతో నిర్మించుకోవడం మాత్రమే. ప్రజలు ఏమరుపాటులో ఒక దఫా అధికారం ఇచ్చినందుకు, ఇక జీవిత పర్యంతమూ తానే ముఖ్యమంత్రిగా ఉండిపోతానని భ్రమించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల ముసుగులో ప్రజలకు డబ్బు పంచుతూ ఉంటే.. తన గల్లాపెట్టెలో ఎప్పటికీ ఓట్లు రాలుతూనే ఉంటాయని అనుకున్న ఆయనకు తల బొప్పి కట్టింది.
తాను సీఎంగా శాశ్వతం అంటూ నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ భవనాలను ఆయన అప్పట్లోనే ప్రారంభించారు గానీ.. ఒక్కరాత్రి అయినా బసచేయలేదు. ఇప్పుడవి నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 500 కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన ఆ భవనాలను ఏం చేయాలో తెలియక, ఆరునెలలుగా చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పుడు ఆ రుషికొండ భవనాలను ఏం చేయాలనే విషయంలో ప్రజల నుంచే అభిప్రాయాలు తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.
తాజాగా విశాఖపట్నంలో కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. రుషికొండ భవనాల నిర్మాణాన్ని ఒక పిచ్చిపనిగా అభివర్ణించారు. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. రుషికొండ భవనాలను ఏం చేయాలనే విషయంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలని అశోక్ గజపతి సూచిస్తున్నారు.
ప్రభుత్వం కూడా ఈ భవనాల విషయంలో సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు చాలా విషయంలో పూర్తి పారదర్శకంగా, ప్రజాస్వామికంగా ఉంటున్నారు.
ఇటీవల ఒక సందర్భంలో విలేకర్ల సమావేశంలో రుషికొండ భవనాల గురించి కొందరు అడిగితే.. ఏం చేయాలో మీరే చెప్పండని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను ఉత్తినే అలా అడగడం లేదని, నిజంగానే అందరినుంచి అభిప్రాయాలు తీసుకుని ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నట్టు చెప్పారు. విలేకర్లు కూడా అభిప్రాయాలు చెప్పాలన్నారు.
అసలు ప్రభుత్వం ఎంత ప్రజాస్వామికంగా ఉన్నదంటే.. అమరావతి నగరంలో సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవనం డిజైన్లను కూడా వారి వెబ్ సైట్ లో పెట్టి.. ప్రజలనే ఎంపిక చేయమని అడిగారు. అలాంటిది.. రుషికొండ భవనాల విషయంలో కూడా.. వాటిని ఎలా ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి లాభసాటిగా ఉంటుందో నాలుగైదు ఆప్షన్లు సిద్ధం చేసి.. వాటిమీద ప్రజాభాప్రాయ సేకరణ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.