ఆగస్టు 15వ తేదీనుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం అమలు చేయడానికి రాష్ట్రప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి విధివిధానాలను డిసైడ్ చేయడానికి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇతర అధికారులతో సమావేశం అవుతున్నారు కూడా. సూపర్ సిక్స్హ్ హామీలలో ప్రకటించిన విధంగా మహిళలకు కేవలం తమ సొంత జిల్లాల పరిధిలో మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొత్తానికి ఈ విధివిధానాలు ఇప్పుడు ఖరారు అవుతాయి. అయితే.. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన.. ఇతర వ్యవస్థలు, వర్గాలు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకుంటోంది సర్కారు. ఆటో డ్రైవర్లకు త్వరలో ప్రతి ఒక్కరికీ పదివేల రూపాయల వంతున ఇవ్వబోతున్నట్టుగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన ప్రధానంగా ఆటో డ్రైవర్లు నష్టపోతారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో షేర్ ఆటోలు నడుపుకోవడమే తమ ప్రధాన జీవనాధారంగా బతుకుతున్న వారి సంఖ్యలు వేలల్లోనే ఉంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వలన తొలుత వీరందరికీ నష్టం తప్పదు. పైగా ఆర్టీసీ వేల సంఖ్యలో కొత్త బస్సులను కూడా కొనబోతోంది. ఎలాంటి అవాంతరాలు, చిక్కులు లేకుండా ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి సిద్ధమవుతోంది. అలాంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు కొన్ని రోజుల వరకు ఖచ్చితంగా గడ్డురోజులు ఎదురవుతాయి. తర్వాత నెమ్మదిగా వారి వ్యాపారం మారిన పరిస్థితులకు తగ్గట్టుగా స్థిరపడుతుంది. ఉచిత ప్రయాణం అమలు తేదీని ప్రకటించినప్పటి నుంచి ఆటో డ్రైవరు వర్గాల్లో ఒక ఆందోళన వ్యక్తం అవుతోంది. వారికి గుడ్ న్యూస్ వినిపిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రతి ఒక్కరికీ పదివేల రూపాయల వంతున ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు.
నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి సర్కారు.అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని గుర్తించడానికి ఇది పెద్ద ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా చూపించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆటోకు పదివేల రూపాయల సాయం అనేది అనూహ్యం. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన అనంతరం అక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు మూడు విడతల్లో 20 వేల రూపాయలు అందజేయబోతున్నట్టుగా కూడా మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే పది లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని రవీంద్ర చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల వారికి వాటిల్లేనష్టం తాత్కాలికం అని.. పెట్టుబడులు పెరిగి సంస్థలు రావడం, తదితర కారణాలతో వారికి అవకాశాలు మళ్లీ పెరుగుతాయని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా విస్తారంగా జరుగుతున్న అభివృద్ధి పనులు అందరి అవకాశాలను మెరుగుపరుస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.