ఏదో ఒక డీల్ వచ్చినప్పుడు.. అందులో అందినంత దోచుకోవడం ఒక ఎత్తు. రాజకీయం కోసం ఎగబడి వచ్చే అక్రమార్కులు పదవులు దక్కిన తర్వాత చేసే పని అదే. అలా కాకుండా.. ఏకంగా విధానాలనే మార్చేసి, కొత్త పద్ధతులను, కొత్త విధానాలను రూపొందించడం.. అవన్నీ కేవలం తమ దోపిడీ ఆలోచనలకు అనుకూలంగా మాత్రమే రూపొందించడం అనేది కేవలం జగన్ దళానికి మాత్రమే చెల్లిన విద్య. గత అయిదేళ్లలో సాగింది అదే. ఇసుక విషయంలో కొత్త విధానం తెచ్చినా, లిక్కర్ వ్యాపారాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకువచ్చి.. బ్రూవరీలను బినామీపేర్లతో దక్కించుకుని.. లెక్కల్లోకి ఎక్కకుండా కోట్లాది రూపాయల మద్యం అమ్మేసి అంతా కాజేసిన విధానాలన్నీ అలాంటివే. రేషన్ బియ్యం బొక్కడానికి తీసుకువచ్చిన అలాంటి సరికొత్త విధానాల ద్వారానే స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగిందని గుర్తించిన కూటమి ప్రభుత్వం.. వాటికి ఇప్పుడు చెక్ పెడుతోంది.
ప్రెవేటు గిడ్డంగుల్లో రేషన్ బియ్యం నిల్వ చేసుకుంటే.. నిర్వహణ బాధ్యతలు మొత్తం ఆ గిడ్డంగుల యజమానులకే ఉండేలా.. జగన్ సర్కారు కొత్త విధానం తీసుకువచ్చింది. ఆ మార్గంలో బియ్యం విచ్చలవిడిగా దోచేసి స్మగ్లింగ్ చేసుకోవడానికి ఇది సులువైన మార్గంగా భావించారు. రెండో కంటికి తెలియకుండా అంతా జరిగిపోతుందని అనుకున్నారు. పైగా ఈ విధానంలో డీల్ కుదుర్చుకోబోయేది అంతా జగన్ దళానికి చెందిన వారితోనే కాబట్టి.. నిబంధనల్ని కూడా మార్చారు. ఎలాగంటే..
గిడ్డంగుల సంస్థతో పీడీఎస్ బియ్యం నిల్వకు ఉన్న ఒప్పందాల లీజు పరిమితి 3 నెలలు మాత్రమే ఉండేవి. మూడు నెలలకు అద్దె చెల్లించి.. అంతకంటె ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సి వస్తే.. మళ్లీ కొనసాగించేవారు. జగన్ హయాంలో గిడ్డంగుల సంస్థను పక్కకు తప్పించి.. నేరుగా ప్రెవేటు గిడ్డంగుల్ని లీజుకు తీసుకోవడం ప్రారంభించారు. బస్తాకు నెలకు రూ.5 వంతున అద్దె చెల్లించేవారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఎన్ని నెలలు నిల్వ చేసినప్పటికీ.. ఒకసారి డీల్ చేసుకున్న తర్వాత.. మినిమం 12 నెలలకు అద్దె చెల్లించాల్సిందే. అలా అయినవారికి దోచిపెట్టారు. ఇది రికార్డుల్లో కనిపించే దోపిడీ అయితే.. ఆ ప్రెవేటు గిడ్డంగుల్లో ఉన్న బియ్యాన్ని స్మగ్లింగుకు తరలించడం అనేది.. వక్రమార్గంలో దోపిడీ.
పేర్ని నాని గోడౌన్ల నుంచి బియ్యం మాయమైన వ్యవహారాన్ని దర్యాప్తు చేయడం మొదలయ్యాక.. జగన్ సర్కారు అప్పట్లో ఎన్ని రకాల దోపిడీకి తెరతీసినదో ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి.. తిరిగి గిడ్డంగుల సంస్థ ద్వారానే నిర్వహణ జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నది.