ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం విభిన్నమైన శైలిలో ప్రజలకు సేవలు అందిస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ఆ మేరకు సంక్షేమ పథకాలను విప్లవాత్మక శైలిలో అమలు చేయడం మాత్రమే కాదు.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా సరే, ప్రజల జీవితాలను మెరుగుపరిచే, స్వావలంబన దిశగా నడిపించే అనేక ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజల జీవితాలకు కూడా హైటెక్ టెక్నాలజీ ఉపయోగపడేలాగా తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సత్ఫలితాలను ఇస్తున్నది. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభ సమయంలో ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడుకు అనుభవం అయింది.
స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశ అవకాశం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు కొంత దూరం బస్సులో ప్రయాణించి ఆ బస్సులో ఉన్న పలువురు మహిళలతో ముచ్చటించి వారి వివరాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఓ మహిళతో మాట్లాడినప్పుడు తమది ఉమ్మడి కుటుంబం అని తమ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని గతంలో ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి పథకం వచ్చేదని ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ముగ్గురు పిల్లలకు కూడా తల్లికి వందనం అందజేస్తున్నారని ఆమె హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తల్లికి వందనం నిధులు తమ ఖాతాకు వచ్చిన విషయాన్ని తాము వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే.. ఆధార్ కార్డు నెంబరు కూడా ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకున్నట్టు ఆమె చంద్రబాబుకు వివరించారు. ఇదివరకు అయితే.. ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి, అప్ డేట్ తెలుసుకోవడానికి కూడా గ్రామ సచివాలయానికి వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు వాట్సఫ్ గవర్నెన్స్ కారణంగా చాలా సమయం ఆదా అవుతున్నదని ఆమె చంద్రబాబుతో చెప్పడం విశేషం.
వాట్సప్ గవర్నెన్స్ అనేది పేదల జీవితాలకు ఎలా ఉపయోగపడుతున్నదో ఈ ఉదాహరణ గమనిస్తే మనకు అర్థమవుతుంది.
అలాగే మరో మహిళతో చంద్రబాబు సంభాషించినప్పుడు.. తమ దంపతులు ఇద్దరూ కలిసి చేపలను ఊర్లకు తీసుకెళ్లి అమ్మి పొట్టపోసుకుంటూ ఉంటామని ఆమె తెలియజెప్పింది. ప్రతిరోజూ తాము చేపల అమ్మకం ద్వారా 500 రూపాయలు సంపాదిస్తుంటామని, తనకు చేపలతో వెళ్లి అమ్ముకుని తిరిగి రావడానికి ప్రతిరోజూ వందరూపాయల దాకా ఖర్చవుతుందని.. ఇప్పుడు ఆ డబ్బు తమ కుటుంబానికి మిగులుతుందని ఆమె సంతోషంగా చెప్పింది.
ప్రభుత్వం మహిళల, పేదల జీవితాల్లో తీసుకువస్తున్న గుణాత్మక మార్పు అంటే ఇదే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఉచిత ప్రయాణం కారణంగా.. ఇలా స్వయం ఉపాధుల మీద బతికే, చిరుద్యోగాల మీద బతికే వారికి చెప్పలేనంత మేలు జరుగుతుందని అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన కలిగే సత్ఫలితాలు ముందుముందు ఇంకా గణనీయంగా కనిపిస్తాయని.. పట్టణాలు, ఇతర ఊర్లలో కూడా మానవవనరులు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని, చిన్నచిన్న సంస్థల ఉత్పాదకత కూడా బాగా పెరుగుతుందని.. ఇవన్నీ ఇప్పుడే పైకి కనిపించని ప్రయోజనాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా.. వాట్సప్ గవర్నెన్స్ తరహాలో ప్రభుత్వం చెప్పకుండా చేస్తున్న మేలు కూడా తక్కువేమీ కాదని పలువురు అంటున్నారు.