రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అదుపుతప్పాయన్నమాట వాస్తవం. ప్రజలు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. ఘర్షణలు చెలరేగుతున్న చాలా ప్రాంతాలలో ఇప్పటిదాకా దుకాణాలు తెరిచిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలి. కానీ మరో 20 రోజుల్లో అధికారికంగా ప్రకటితమయ్యే ఓటమిని సమర్ధించుకోవడానికి యిప్పటినుంచే సాకులు వెతుక్కుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి బురద పులమాలని చూస్తున్నది. తాము చేయించుకున్న సర్వేలలో ఓటమి తప్పదనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో.. ఆ పరాభవం తమ వైఫల్యం కాకుండా తమకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని చాటి చెప్పడానికి వారు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్నికల సంఘానికి తెలుగుదేశంతో అక్రమ సంబంధం అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో సాధారణంగా ఎన్నికల సంఘానివే సర్వాధికారాలు! ఏ పార్టీ అయినా సరే పాలక ప్రతిపక్షం అనే హోదాలతో నిమిత్తం లేకుండా.. ఎన్నికల సంఘానికి లోబడి ఉండాలి. అయితే ఓటమి భయం వెన్నాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఎన్నికల సంఘానికి అక్రమ ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు.
ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయ్యి తమ స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రధాని మోడీని బతిమాలి బిజెపితో పొత్తు కుదుర్చుకున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు.
ముఖ్యమంత్రి తరఫున ఆయన గళం తానే అయినట్లుగా ప్రెస్ మీట్ లలో పార్టీ విధానాలను ప్రకటించే సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణ ఇది. ఇలాంటి ఆరోపణల ద్వారా.. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు అని సజ్జల పరోక్షంగా నిందిస్తున్నారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందంగా.. అధినేత మౌత్ పీస్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ముడిపెట్టి ఆరోపణలు చేస్తుంటే.. ఆ పార్టీ ఇతర నాయకులు తమ తమ నియోజకవర్గాల జిల్లాల పరిధిలో ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్ల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ తరఫున అబ్జర్వర్లుగా వచ్చిన ఉన్నతాధికారులు తెలుగుదేశం సానుభూతిపరులతో కుమ్మక్కు అయి వ్యవహారం నడిపించారని చెబుతున్నారు.
ఏ రకంగా చూసినా సరే కేంద్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది.. అని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడం ద్వారా రేపు తమ ఓటమి ఖరారు కాగానే అది కూడా ఎన్నికల సంఘం కుట్ర అని నింద వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.