మార్పుల లక్ష్యం : అసంతృప్తి ఉండరాదు.. గెలుపు చేజారరాదు!

చంద్రబాబునాయుడు మొత్తం అయిదు సీట్లలో అభ్యర్థులను మార్పు చేశారు. ఈ మార్పులనుకూడా ప్రకటించిన తర్వాత.. ఆయన పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అయితే ఈ మార్పుల వెనుక గెలుపే లక్ష్యంగా కనిపిస్తోంది.  మొత్తం అయిదు స్థానాల్లోచంద్రబాబునాయుడు అభ్యర్థులను మార్చారు. ఈ మార్పులన్నింటిలోనూ కనిపిస్తున్న లక్ష్యం ఒక్కటే. అసంతృప్తి ఉండరాదు.. గెలుపు చేజారరాదు.

పాడేరులో కొత్తగా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చారు. అలాగే మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తిని ఎంపిక చేశారు. వీరిద్దరినుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వెల్లువెత్తుతూ వచ్చింది. తొలుత వెంకటరమేశ్ నాయుడును ఎంపికచేశారు. అయితే గిడ్డి ఈశ్వరి కూడా నామినేషన్ వేయడానికి సిద్ధపడడంతో చివరకు ఆమె పేరును ఖరారుచేశారు. అలాగే మాడుగుల నుంచి ముందుగా పైలా ప్రసాద్ ను అనుకున్నారు. కానీ.. బండారు సత్యనారాయణమూర్తి నియోజకవర్గం పెందుర్తి పొత్తుల్లో జనసేనకు వెళ్లడంతో ఆయనకు మరొకచోట టికెట్ ఇవ్వడం అనివార్యం అయింది. దాంతో పైలా ప్రసాద్ కు నచ్చజెప్పి ఆ నియోజకవర్గంలో పుష్కలమైన బంధువర్గం, పరిచయాలు ఉన్న బండారుకు టికెట్ ఇచ్చారు.

మడకశిరలో తొలుత సునీల్ కుమార్ పేరును ప్రకటించారు గానీ.. రకరకాల సమీకరణాలను పరిశీలించిన తర్వాత.. తాజాగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి విషయంలో గతంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియకు టికెట్ ఇచ్చారు. అయితే స్థానిక సర్వేల్లో ఆమె కాస్త బలహీనంగా తేలడంతో, ఆమె తండ్రి రామక్రిష్ణ పేరునే ఖరారు చేశారు.

సంచలనంగా మారిన ఉండి నియోజకవర్గం చివరకు రఘురామక్రిష్ణ రాజుకే దక్కింది. అక్కడి ఎమ్మెల్యే రామరాజును నరసాపురం పార్లమెంటు పార్టీ ఇన్చార్జిగా చేశారు. ఆ పదవిలో ఉన్న తోట సీతారామలక్ష్మిని పాలిట్ బ్యూరో సభ్యురాలు చేశారు. మొత్తానికి ఎవ్వరిలోనూ అసంతృప్తి రేగకుండా ఉండడం ఒక్కటే లక్ష్యంగా ఈ మార్పులన్నీ జరిగాయి. మరి వీరు ఎన్నికల సమరాంగణంలో ఎలా చేస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories