ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. రెండు పార్టీల నుంచి అరెస్టులు 

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలనే కృతనిశ్చయంతో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. అదేవిధంగా ప్రజలను రెచ్చగొట్టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణం కాగలరని భావిస్తున్న నాయకులను కూడా అరెస్టు చేశారు. అయితే ఇక్కడ పోలీసులను ప్రత్యేకంగా ప్రశంసించాల్సింది ఏమిటంటే.. వారు ఏ రకమైన అభిమానం చూపించడం లేదు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను కూడా అరెస్టు చేసి నిర్బంధించడం ద్వారా ఎన్నికల ప్రశాంత నిర్వహణకు వారు ప్రయత్నిస్తున్నారు.

కొన్ని రోజులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టే మాటలతో చెలరేగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పులివెందులలో తెలుగుదేశం పార్టీ రాక్షస రాజ్యం నడిపిస్తున్నదని, ఇలాంటివితాము సహించేది లేదని, గట్టిగా బుద్ధి చెబుతామని.. ఆయన రకరకాలుగా తమ పార్టీ వారిని రెచ్చగొడుతున్నారు. ఏ పోలింగ్ బూత్ లలో అయితే వైసిపి విచ్చలవిడి రిగ్గింగ్ కు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నదో ఆ పోలింగ్ బూత్ లను ఈసారి మార్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి అనేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ నాడు కూడా ఇలాంటి పనులు చేస్తారనే ఉద్దేశంతో ఆయనను ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాంప్రసాద్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన సతీష్ రెడ్డి, మరో సర్పంచిని కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఏ పార్టీకి చెందిన నాయకుడైనా సరే.. అతని కారణంగా పోలింగ్ నాడు ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని అనిపిస్తే అడ్డుకోవడానికి, అదుపులోకి తీసుకోవడానికి తాము వెనకాడేది లేదని నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు తమ చర్యలతో నిరూపిస్తున్నారు.

అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా చెలరేగుతూ పోలీసు అధికారులు తీరు మీద నిందలు వేయడం గమనార్హం. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వారి ఆరోపణలు నిజం కాదని తెలుగుదేశం ఎమ్మెల్సీ అరెస్టుతోనే స్పష్టమవుతుంది. అయితే తమ చేతిలో సొంత మీడియా, టీవీ ఛానల్ ఉన్నాయి గనుక పదేపదే గోబెల్స్ ప్రచారానికి వైసీపీ నేతలు తెగిస్తున్నారు. పోలీసులు మాత్రం విమర్శలను పట్టించుకోకుండా ప్రశాంత ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే తమ లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories