మణులు మాణిక్యాలు కూడబెట్టిన సంపద కాదు.. మనిషిలో మానవత్వపు పరిమళం కొంత ఉంటే చాలు. తనను ఇష్టపడే వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా తనలోని అలాంటి మానవత్వపు పరిమళాన్ని తాజాగా నిరూపించుకున్నారు. నాలుగుదశాబ్దాలకు పైబడి ఓ సామాన్య కార్యకర్తతో ఉన్న పరిచయాన్ని ఆయన గుర్తు చేసుకున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ కార్యకర్తనైతే ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది.
వివిధ నగరాల పర్యటనల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వాహన కాన్వాయ్ ఎంత వేగంగా వెళుతూ ఉంటుందో ప్రజలు ఊహించుకోవడం కష్టం కాదు. ముఖ్యమంత్రి ఆ రోడ్డమ్మట ప్రయాణిస్తున్నారంటే.. పోలీసులు ఓ అరగంట ముందుగానే రోడ్డు మొత్తం క్లియర్ చేసి చిన్న ఆటంకం కూడా లేకుండా ఖాళీ చేసి పెడతారు. రెప్పవేసి తెరచేలోగా మాయమైపోయే వేగంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలు వెళ్లిపోతాయి. అంత వేగంగా వెళ్లే వాహనాల్లోంచి.. రోడ్డు పక్కగా నిల్చుని ఉన్న ఒక వ్యక్తిని గమనించి.. గుర్తించి.. అతడితో తన పూర్వ అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని.. వాహన కాన్వాయ్ ను ఆపించి.. ఆ వ్యక్తిని పలకరించి.. కుశలం అడిగి, ధైర్యం చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. చంద్రబాబునాయుడు విషయంలో అదే జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో ఐటీసీఎక్స్ 2025 సదస్సులో పాల్గొన్నారు. తిరుగుప్రయాణం అయినతర్వాత మంగళం రోడ్డు మీదుగా విమానాశ్రయానికి వెళుతున్నారు. ఆ సమయంలో దారి పక్కగా తెల్లని జుట్టుతో నిల్చుని ఉన్న ఓ వ్యక్తిని చూసి ఒక్కసారిగా తన వాహనం ఆపాలని డ్రైవర్ ను ఆదేశించారు. కారు అద్దం కిందికి దించి.. ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచారు. ‘ఏం బాషా.. బాగున్నావా.. ఆరోగ్యం బాగుందా?’ అని కుశల ప్రశ్నలు వేశారు. దాంతో , కాన్వాయ్ వాహనాలు వెళుతుండగా.. కేవలం చంద్రబాబునాయుడును చూడడం కోసమే వచ్చి రోడ్డు పక్కన నిల్చున్న సదరు వ్యక్తి అజీజ్ బాషా.. ఆనందంలో మునిగిపోయాడు. అతను మంగళం ప్రాంతానికే చెందిన పార్టీ కార్యకర్త. ‘40 ఏళ్లుగా నేను చంద్రబాబుకు తెలుసు. ఆయన్ను చూసేందుకు వచ్చా. భద్రత కారణాల వల్ల రోడ్డు పక్కన నిలబడిపోయా.. ఆయనే నన్ను గుర్తుపట్టి పలకరించారు..’ అంటూ భాషా కన్నీళ్లతో చెప్పడం పలువురిని కదిలించింది.
చంద్రబాబునాయుడు ఏడాదికోసారం పండగకు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లినా, కుప్పం నియోజకవర్గానికి వెళ్లినా.. సామాన్య కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తారనే గుర్తింపు ఉంది. నారావారిపల్లెలో ఒక పూట పల్లెలోని అందరి ఇళ్లకు వెళ్లి మరీ పలకరిస్తారనే పేరుంది. అలాంటి అపూర్వమైన మానత్వపు పరిమళాన్ని, అజీజ్ బాషాను పలకరించడం ద్వారా చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.