తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు చాలా మందే ఉంటారు. కానీ వారందరూ కూడా పార్టీ సభ్యత్వం తీసుకుని క్రియాశీల కార్యకర్తలుగా ఉంటారనే నమ్మకం ఏమీ లేదు. అందుకే, పార్టీని సీరియస్ గా అభిమానించే వారికి, క్రియాశీల సభ్యత్వాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీలోకి సభ్యత్వాల సంఖ్య బీభత్సంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం ఒక్కటే ఇందుకు కారణం అని చెప్పడానికి వీల్లేదు. కార్యకర్తల సంక్షేమం పట్ల, పార్టీని నమ్మి సభ్యత్వాలు తీసుకున్న వారి బాగోగుల పట్ల పార్టీ చూపిస్తున్న శ్రద్ధ, పథకాల వల్ల కూడా అభిమానులు ఎగబడి సభ్యత్వాలు తీసుకునే వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం నాడు తిరిగి ప్రారంభం కానుంది. 175 నియోజకవర్గాల్లో కూడా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలంటూ చంద్రబాబునాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుములో ఎలాంటి మార్పు చేయలేదు. ఆసక్తి గల కార్యకర్తలు రూ.100 కట్టి సభ్యత్వం తీసుకోవచ్చు. శాశ్వత సభ్యత్వం కోరుకునే వారు మాత్రం రూ.లక్ష కట్టాలి. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తారు. గతంలో ఈ బీమా రూ.2 లక్షలే ఉండేది. వందరూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే.. 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తించడం అనేది.. పేద వర్గానికి ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా ఎవరైనా చనిపోయినట్లయితే వారికి మట్టి ఖర్చుల కోసం పదివేల రూపాయలు కూడా ఇస్తారు. పార్టీ సభ్యుల జీవితాల గురించి, బాగోగుల గురించి పట్టించుకునే పార్టీగా తెలుగుదేశం ఇలాంటి పథకాలు అమలు చేస్తుండడంతో ఈ దఫా పెద్ద సంఖ్యలో చేరే అవకాశం ఉంది.
తెలుగుదేశం సభ్యత్వాలు పెరగడానికి మరో కారణం కూడా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలు కూడా బాగా విసిగిపోయి ఉన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకమే ఎవరికీ లేకుండా పోతోంది. అలాంటప్పుడు వైసీపీలో కొనసాగడం కంటె.. తెలుగుదేశంలో చేరడం మంచిది అనే భావన అందరిలోనూ ఉంది. నాయకులు, పెద్దస్థాయి వారి వరకు అలా పార్టీ మారినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. కిందిస్థాయి కార్యకర్తలు, సాధారణ సభ్యులు పలువురు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే భాగంగా తెదేపా తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంటుందని కూడా పలువురు భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు టార్గెట్లు పనెడుతున్నట్టుగా.. ఈసారి సభ్యత్వ నమోదుల్లో తెలుగుదేశం రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.