ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్ని సామెత. తేడా గాడు అయినటువంటి ఒక దొంగ.. తాను దొంగతనం చేసి, పోలీసోడినే వెంటపడి తరిమేడని ఈ సామెత చెబుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార సరళి అందుకు భిన్నంగా ఎంత మాత్రమూ లేదు. వారు అలాంటి ప్రయత్నాలనే చేస్తున్నారు గాని.. కోర్టు ఎదుట వారి పప్పులు ఉడకడం లేదు. అల్లర్లకు హింసాత్మక కార్యక్రమాలకు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రధాన కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. తామేదో శుద్ధపూసలు అయినట్లుగా.. రీ పోలింగ్ కోసం వారే పిటిషన్లు వేయడం ఇప్పుడు తేలిపోయింది.
పోలింగ్ నాడు తీవ్రమైన అల్లర్లు చోటు చేసుకున్న నియోజకవర్గాలలో.. సత్తెనపల్లి, చంద్రగిరి కూడా ఉన్నాయి. పోలింగ్ నాడు చంద్రగిరి నియోజకవర్గంలో బోలెడు ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ తర్వాత కూడా అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఈ ఘటనల పర్యవసానంగా ఎస్పీ ఏకంగా బదిలీ అయ్యారు. వైసీపీ వైపు వేలెత్తి చూపే విధంగా ఎన్నో ఘటనలు జరుగుతుండగా.. అక్కడి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాత్రం చంద్రగిరిలో రీపోలింగ్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
సత్తెనపల్లి వ్యవహారం కూడా ఇంతకంటే భిన్నంగా ఏం లేదు. అక్కడ వైసిపి అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు. తన నియోజకవర్గంలో ‘మంత్రినైన తన మాట చెల్లుబాటు కావడంలేదని’ ఆయన పోలింగ్ నాడు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు మంత్రి మాట వినాలనే లాజిక్ పోలింగ్ నాడు పని చేయలేదని సంగతి ఆయన మరిచిపోయారు. పోలీసులు చట్టప్రకారం మాత్రమే వెళతారని మంత్రి గనుక ఆయన అడుగులకు మడుగులొత్తరని, కనీసం ఆరోజు స్వతంత్రంగా పనిచేస్తారని ఆయన తెలుసుకోలేదు.
పోలీసుల తీరు గురించి తొలుత అలాంటి డైలాగులు వల్లించిన అంబటి రాంబాబు.. సత్తెనపల్లిలోని ఏకంగా నాలుగు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరగాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. చూడబోతే ఎక్కడైతే తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువగా పడి ఉంటాయని అనుమానం ఆ పార్టీలో ఉన్నదో అక్కడంతా రిపోలింగ్ కోరినట్లుగా కనిపిస్తోంది.
దాదాగిరి వారే చేసి.. ఆ దశలో తమ పప్పులు ఉడకకపోవడం వలన కోర్టు మెట్లు ఎక్కి రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తే ఆ కుటీల యత్నాలను హైకోర్టు అనుమతించలేదు. నిజానికి రీపోలింగ్ కావాలనుకుంటే పోలింగ్ రోజున లేదా మరుసటి రోజున ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసుకోవాలి. ఆ పని చేయకుండా ఓటమి భయం మొదలైన తర్వాత మాత్రమే రీపోలింగ్ అంటూ నానా హడావిడి చేయడం కోర్టు ద్వారా మరొకసారి పరువు పోగొట్టుకోవడం వారికే నష్టం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.