ముంబాయికి చెందిన నటి కాదంబరి జెత్వానీ పై అక్రమంగా కేసులు నమోదు చేసి, ఆమె కుటుంబాన్ని మొత్తం అక్రమంగా నిర్బంధించడంతో పాటూ అరాచకంగా వేధించినందుకు.. ఇప్పుడు కేసులు నమోదై విచారణ సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో.. కాదంబరి జెత్వానీ మీద తప్పుడు కేసులు పెట్టి, ఆమె కుటుంబాన్ని వేధించడానికి ప్రధాన కారకుడు అయిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ రెండు నెలలకు పైగా రిమాండు ఖైదీగా జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు ఈ కేసులో బెయిలు లభించింది. గతంలో పలుమార్లు ఆయన బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైంది. తాజాగా కూడా.. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయగలరని జెత్వానీ, పోలీసు తరఫు న్యాయవాదులు పేర్కొన్నప్పటికీ మొత్తానికి షరతులతో కూడిన బెయిలు వచ్చింది.
ఒకవైపు కేసులో ప్రధానమైన వ్యక్తి కుక్కల విద్యాసాగర్ బెయిలు మీద బయటకు రాగా.. వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూడడమే తమ జీవితాశయం అన్నట్టుగా.. తమ పరిధిని మించి వ్యవహరించి, అతి చేసిన ఐపీఎస్ అధికారులు అరెస్టు అవుతారా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరానా తాతా, విశాల్ గున్నీ లు వైసీపీ పెద్దల పురమాయింపు మేరకు కాదంబరి జెత్వానీ ని వేధించడానికి కక్ష కట్టినట్టుగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వీరిని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఏసీపీ, సీఐలు కూడా సస్పెన్షన్ లోనే ఉన్నారు. ఈ పోలీసు అధికారుల్లో ఒకరు విచారణలో.. అసలు జరిగినదంతా విపులంగా పూసగుచ్చినట్టు చెప్పేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
అసలు కుక్కల విద్యాసాగర్ పోలీసుల వద్ద కేసు రిజిస్టరు చేయడానికంటె ముందే.. పోలీసు అధికారులు ముంబాయి వెళ్లడానికి ఫ్లయిటు టికెట్లు బుక్ చేసుకోవడం, కాదంబరిని తల్లిదండ్రుల సహా అరెస్టు చేసి తీసుకువచ్చి నిర్బంధించడం ఇవన్నీ కూడా వారి అరాచకాలుగా ముద్రపడ్డాయి.
ఈ కేసు విచారణ సాగుతున్న క్రమంలో.. సస్పెండయిన పోలీసు అధికారుల్ని కూడా త్వరలోనే పోలీసులు అరెస్టు చేయవచ్చునని తెలుస్తోంది. వారిద్వారా బయటకు వచ్చే వాస్తవాలతో.. వైసీపీ పెద్దలకు కూడా జైలు యోగం తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.