ప్రభుత్వంలో ఒక పని పూర్తి చేయడానికి ఒక నాయకుడు తన శాయశక్తులా కృషి చేసిఉంటే, అందుకోసం పరితపించి ఉంటే.. అలాంటి నాయకుడిని ఆ పనికి పెడితే సబబుగా ఉంటుంది. అలా కాకుండా.. అధికారం తమ చేతికి వచ్చింది కదా అని.. ఉన్న ప్రాజెక్టులు అన్నింటికీ తనకు నచ్చిన పేర్లు పెట్టేసుకుంటే కామెడీగా ఉంటుంది. రాష్ట్రంలో అనేక పథకాలకు, ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరి అదే. అర్థం పర్థం లేకుండా నీటి ప్రాజెక్టులకు తన తండ్రి వైయస్ఆర్ పేరు పెట్టుకున్నారు జగన్. ఆ ఓవర్ యాక్షన్ పనులను ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. తమ పార్టీకి చెందిన వ్యక్తుల పేర్లే ప్రధానం అనే యావ వదిలేసి.. ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్దరిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 12 నీటి ప్రాజెక్టులకు, జగన్ సర్కారు పెట్టిన పేర్లను తొలగించి అంతకు ముందు ఉన్న పాత పేర్లను పునరుద్ధరించేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు, ముక్త్యాల ఎత్తిపోతల పథకం వంటివి ఇందులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి పేర్ల పిచ్చి ఉన్నట్లుగా.. ప్రతి పథకానికి ఎన్టీఆర్ పేరును జోడించాలని చంద్రబాబు నాయుడు ఆత్ర పడలేదు. ఆ పథకాలకు సహజంగా ఏ పేరు బాగుంటుందో అవే పెట్టారు. జగన్ లాగా తమకు సంబంధం లేని ప్రాజెక్టులకు కూడా తమ పేరు పెట్టుకోవాలి అనే అతిశయ పోకడను ప్రదర్శించలేదు. ఇలా పథకాలకు ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాల మధ్య హస్తిమశకాంతరం అనదగినంతటి తేడా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి సంబంధించిన పథకాలు కూడా జగన్ కుటుంబ పేర్లతోనే నిండిపోయాయి. కొత్త ప్రభుత్వం ఆ పేర్లను తొలగించింది. జాతీయస్థాయిలో విద్యారంగంలో పేరు మోసిన మహానుభావుల పేర్లను పథకాలకు పెడతాం.. అని మంత్రి లోకేష్ ప్రకటించారు కూడా. ఆ వైఖరిలోనే జగన్ చంద్రబాబు ప్రభుత్వాల మధ్య పేరు పిచ్చి విషయంలో ఉండే తేడా తెలిసిపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.