అధికారంలో చేసిన ఓవరాక్షనే నందిగంకు శాపం!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు గడ్డు రోజులు అప్పుడే తొలగిపోయేలా లేదు. ఆయనకు జైలు జీవితం ఇప్పట్లో తప్పేలా లేదు. ఒక కేసులో ఆయనకు బెయిలు లభించింది గానీ.. మరో కేసులో అంతకంటె లోతుగా కూరుకుపోయారు. సుప్రీం కోర్టు దాకా వెళ్లినప్పటికీ ఉపశమనం లభించలేదు. పైగా జగన్ జమానాలో అధికారం తమ చేతిలో ఉన్నది కదా అని చట్టాన్ని లెక్క చేయకుండా.. విచ్చలవిడిగా వ్యవహరించిన తీరు కారణంగానే.. ఇప్పుడు కనీసం బెయిలు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడినట్టుగా అర్థమవుతోంది. చార్జిషీట్ దాఖలయ్యే దాకా నందిగం సురేష్ కు బెయిల్ సంగతి చెప్పలేం అని సుప్రీం తేల్చేసింది.

నందిగం సురేష్ మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. హత్యాయత్నం వంటి సీరియస్ కేసులు కూడా ఉన్నాయి. పైగా జగన్ జమానాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఆయన అరెస్టు అయ్యారు. రిమాండు మీద జైల్లో ఉండగానే.. ఆయన మీద మరియమ్మ హత్య కేసు కూడా వచ్చి పడింది. ఆ కేసులో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. మరో రిమాండు విధించారు. టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో బెయిలు వచ్చింది గానీ.. మరియమ్మ హత్యకేసులో రిమాండు కొనసాగుతూనే ఉంది. ఆయన పలుమార్లు బెయిలు కోసం పిటిషన్ పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించినా కూడా ఫలం దక్కలేదు.
బెయిలు సంగతి అలా ఉంచితే ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా గమనించాలి.

మరియమ్మ మృతికి కారణమైన ఘర్షణలు జరిగినప్పుడు.. ‘ఎఫ్ఐఆర్ లో అందరినీ నిందితులుగా పేర్కొంటూ, నందిగం సురేష్ ను ఒక్కరిని మాత్రం ఎందుకు మినహాయించారు’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘మీ పార్టీనే అధికారంలో ఉన్నందువల్ల మీ పేరు తప్పించారు. లేదంటే ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగతా మిమ్మల్ని అప్పుడే నిందితుల జాబితాలో చేర్చి ఉండాల్సింది’ అని పేర్కొన్నారు.
తాము అధికారంలో ఉన్నాం కదాని.. తమ పేరు పోలీసుకేసులోకి రాకుండా అప్పట్లో నందిగం సురేష్ మేనేజ్ చేసుకోగలిగారు. కానీ చేసిన పాపం ఊరకే పోదన్నట్టుగా మరియమ్మ హత్య కేసు వ్యవహారం ఆయనకు గట్టిగానే తగులుకుంది. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిన ఫలితమే.. ఇప్పుడు అనుభవిస్తున్నారని అర్థమవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories