జగన్ ఆత్మీయ త్రయానికి కోర్టు బిగ్ షాక్!

ఆ ముగ్గురూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు. మామూలు వ్యక్తులు అరెస్టు కావడానికి, ఆ ముగ్గురూ అరెస్టు అయి రిమాండులో ఉండిపోవడానికి మధ్య జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో చాలా వ్యత్యాసం ఉంది. అరెస్టు అయిన నాటినుంచి వారికోసం ఆయన చాలా ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంతో  మంచి వాళ్లు అయిన అధికార్లను అనవసరంగా జైల్లో పెట్టారని, అసలు స్కాం అంటూ లేకపోయినా తప్పుడు కేసుల్లో తనకు ఆత్మీయులు గనుక వారిని జైలు పాల్జేశారని ఆయన రకరకాలుగా తన భయాల్ని, క్రోధాల్ని, వారి మీద జాలిని వ్యక్తం చేశారు. ఎన్ని జరిగినా.. లిక్కరు కుంభకోణంలో ఆ ముగ్గురి పాత్ర గురించి.. పోలీసులు చార్జిషీటు దాఖలు చేసేసినప్పటికీ కూడా.. వారికి బెయిలు మాత్రం రాలేదు. చార్జిషీటు దాఖలు అయినంత మాత్రాన.. బెయిలు ఇవ్వలేం అని.. ఈ దశలో ఆర్థిక నేరగాళ్లకు బెయిలు ఇస్తే.. దర్యాప్తుకు అవరోధం కలుగుతుందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మూడున్నర వేల కోట్ల రూపాయలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన దళాలు కలిసి కాజేసిన కేసులో రిమాండులో ఉన్న నిందితులు.. తమ బెయిలు కోసం బేతాళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సిట్ పోలీసులు కోర్టు ఎదుట సమర్పించిన రెండో చార్జిషీట్ లో అప్పటి జగన్ పేషీలోని కీలక అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, భారతి సిమెంట్స్ లో పూర్తి కాల డైరక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్ర గురించి పూర్తి వివరాలను అందించింది. దానిని ఆధారం చేసుకుని ఈ ముగ్గురూ తమకు బెయిలు కావాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తమ మీద చార్జిషీటు కూడా దాఖలైందని, ఆల్రెడీ 90 రోజులకు పైగా జైల్లోనే ఉన్నామని.. తమకు బెయిలు ఇవ్వాలని వారు కోరారు. ఆర్థిక నేరాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక ప్రయోజనాలకు మధ్య సమతుల్యతను చూడాల్సి ఉందని పేర్కొన్న కోర్టు.. ఈ కారణాల మీద ఇవ్వలేం అని తేల్చింది. ఈ నిందితులు బెయిలుపై బయటకు వెళితే.. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే అనుమానాన్ని వెలిబుచ్చింది. భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారిన ఈ కేసులో బెయిలు సాధ్యం కాదని తేల్చింది.

మద్యం పాలసీ రూపకల్పన, వసూళ్ల నెట్వర్క్ కు సంబంధించి.. వ్యూహరచన సమావేశాల్లో ధనజంయరెడ్డి కీలక పాత్రధారి అని పోలీసుల న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిందని పిటిషనర్ చెప్పిన మాటలే వాస్తవం కాదని, దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నదని చెప్పారు. అలాగే కృష్ణ మోహన్ రెడ్డి గురించి.. మద్యం విధానం రూపొందించడం దగ్గరినుంచి.. దానిని అమలు చేసిన ఏజన్సీలకు మధ్య ఆయనే సంధానకర్త అని వ్యాఖ్యానించింది. వీళ్లందరూ కూడా మద్యం కుంభకోణం ద్వారా కూడబెట్టిన సొమ్ములతో అనేక ఆస్తులు కూడా కొన్నట్టు న్యాయవాదులు తేల్చిచెప్పారు.

గోవిందప్ప బాలాజీ పాత్ర ఇంకా కీలకం అని పోలీసులు వ్యాఖ్యానించారు. రాజ్ కెసిరెడ్డి ఇతర నిందితులతో గోవిందప్ప తరచూ సమావేశాల్లో పాల్గొన్నారని.. మద్యం డిస్టిలరీల నుంచి సొమ్ము రాబట్టడంలో ఆయనది కీలక పాత్ర అని.. పోలీసు కస్టడీలో విచారణకు ఆయన ఇప్పటిదాకా సహకరించలేదని కూడా పేర్కొన్నారు. గతంలో అధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ల వాంగ్మూలాల్లో గోవిందప్ప పాత్ర చాలా స్పష్టంగా తేలిందని కూడా ప్రస్తావించారు. దాంతో తమ మీద చార్జిషీట్ వేయడం పూర్తయింది గనుక.. ఇక తాము బయటకు వెళ్లవచ్చు అనుకున్న వారి ఆశలు అడియాసలు అయినట్టే. ఇప్పట్లో వారికి బెయిలు దక్కేలా లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories