కర్ణుడి చావుకు ఆరు కారణాలు అంటారు పెద్దలు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన రీతిలో 11 సీట్లకు పరిమితమై పతనం కావడానికి మాత్రం చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణాల్లో వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. రాష్ట్రవ్యాప్తంగా కులమతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా.. ఉపాధ్యాయవృత్తిలో ఉన్న వారందరూ జగన్ ను అసహ్యించుకునేలా, ఆయన ఓటమిని కోరుకునేలా తయారయ్యారంటే అందుకు ప్రధాన కారకుడు ప్రవీణ్ ప్రకాష్. ఉపాధ్యాయులను టార్చర్ పెట్టే నిబంధనలను తయారు చేయడం మాత్రమే కాదు.. వారిని పురుగుల కంటె హీనంగా చులకనగా మాట్లాడడం, అవమానించడం, కర్రపెత్తనం చేయడం ఆయనకే సాగింది. అలాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి తన పదవీకాలం ఇంకా ఏడేళ్లు ఉండగా.. అప్పుడే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుని ఇంటిదారి పట్టారు.
జగన్ పట్ల వీరభక్తిని ప్రదర్శించిన ఐఏఎస్ అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ ముందువరుసలోనే ఉంటారు. ఒక బహిరంగ సభ వేదిక మీద జగన్ ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఆయన పాదాల వద్ద కూర్చుని.. ఆయనతో సంభాషించేంతంటి భక్తి ప్రవీణ్ ప్రకాష్ ది. జగన్ పేషీలో ఉండగా అనేక అక్రమాలకు కేంద్రబిందువుగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖకు వెళ్లిన తర్వాత.. మంత్రి బొత్స సత్యనారాయణ దందాలు, అక్రమార్జనలు అన్నింటికీ తానే సూత్రధారిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల విలువైన టెండర్లను ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం ఆయనకే చెల్లింది. ప్రత్యేకించి ఆకస్మిక తనిఖీల పేరుతో టీచర్లను వేధించడం మాత్రమే కాదు, వారిని అవమానించడం కూడా ఆయన నిత్యకృత్యంగా మార్చుకున్నారు.
తెలుగుదేశం కూటమి గెలిస్తే ఇక పనిచేయలేం అని గతంలోనే ఆయన మిత్రులతో వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనను బదిలీచేసి.. పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయమని అన్నారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. పార్కుల్లో, నదీతీరంలో, గుడుల వద్ద హిందీ సినిమా పాటలకు ఇన్‌స్టా రీల్స్ చేసుకుంటూ గడిపారు. తన సర్వీసు ఇంకా ఏడేళ్లు మిగిలిఉన్నప్పటికీ.. ఆయన ఇప్పుడే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. అదికూడా డిజిటల్ సంతకం పెట్టిపంపి చివరి వివాదానికి కారణమయ్యారు. అభ్యంతరాలు వచ్చిన తర్వాత.. అసలు సంతకంతో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి వీఆర్ఎస్ మీద వెళ్లడానికి సీఎస్ ఆమోదించారు. జగన్ తో అంటకాగినందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రస్థానానికి ఏడేళ్ల ముందే ఎండ్ కార్డు పడిపోయింది.