విద్యుత్తు భారం పాపానికి మూల కారణం అన్నయ్యేనట!

చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు  పెంచబోమని ఎన్నికల ప్రచార సమయంలో స్పష్టంగా ప్రకటించారు. వీలైతే జగన్ పెంచిన చార్జీలను తగ్గిస్తాం అని కూడా అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే.. ట్రూ అప్ చార్జీల పేరిట ఇప్పుడు ప్రజల మీద భారం మోపడం జరిగింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ అందుకు భిన్నంగా ఇలా ఎందుకు జరిగిందనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చుకునే వివరణల సంగతి పక్కన పెడితే.. ప్రజల్లోని అలాంటి సందేహాలను నివృత్తి చేస్తున్నారు స్వయానా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల. అన్నయ్య జగన్ చేసిన పాపాల ఫలితంగానే ఇప్పుడు ప్రజల మీద అనివార్యంగా విద్యుత్తు చార్జీల భారం మోపవలసి వచ్చింది అంటున్నారు.

ఇవాళ ప్రజల మీద పడిన విద్యుత్తు చార్జీల సర్దుబాటు భారం యొక్క పాపం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాని దేనని షర్మిల ఆరోపిస్తున్నారు. పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో షర్మిల విజయవాడలో పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. చేతుల్లో లాంతర్లు పట్టుకుని వారంతా తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. విద్యుత్తు చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజల మీద 35 వేల కోట్ల భారం వేయడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రజలు దారుణంగా తిరస్కరించారని గుర్తు చేశారు. అవి చాలవన్నట్లుగా జగన్ చేసిన పాపాల ఫలితంగా ఇప్పుడు కూడా ప్రజల మీద 17 వేల కోట్ల భారం పడే ప్రమాదం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఆ భారం నుంచి ప్రజలను తప్పించాలని వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరుతున్నారు. అవసరమైతే కేంద్రంతో సంప్రదించి వారి నుంచి నిధులు తీసుకుని అయినా సర్దుబాటు చార్జీల భారాన్ని పూడ్చాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా తప్పించాలని ఆమె కోరుతున్నారు.

విద్యుత్తు చార్జీల భారాన్ని కూడా కేంద్రం మీద వేయడం వారి నుంచి నిధులు తీసుకురావడం అంత సులభం కాకపోవచ్చు. తాను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గనుక బిజెపిని కార్నర్ చేయడానికి కేంద్రం నుంచి నిధులు తేవాలని షర్మిల అంటుండవచ్చు గాని అందులో లాజిక్ లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం డబల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న సంగతిని విస్మరించడానికి వీల్లేదు. అమరావతి, పోలవరం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఇలా అనేక రకాల వ్యవస్థలకు కేంద్రం ఇప్పటికే వేల వేల కోట్లు రూపాయలు అందిస్తున్నది. ప్రస్తుతానికి విద్యుత్తు చార్జీల పెంపు భారం ఎవరు భరించాలనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రజల మీద భారం పడడానికి ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి సాధించిన దుర్మార్గమైన పరిపాలనే కారణం అని తాజాగా షర్మిల మాటల ద్వారా ప్రజలకు క్లారిటీ వస్తున్నది.

Related Posts

Comments

spot_img

Recent Stories