హైకోర్టునే బురిడీ కొట్టించిన ఘనాపాటి పీఎస్సార్!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయనే ధీమా.. ఆయన అన్ని రకాల వ్యవస్థలను కూడా ధిక్కరించడానికి, హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేయడానికి లేదా హైకోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి.. న్యాయస్థానాన్ని మోసం చేయడానికి అవసరమైన ధైర్యాన్ని ఆయనకు అందించినట్టుగా కనిపిస్తోంది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న రోజుల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు.. గ్రూప్ 1 పత్రాల మూల్యాంకనం విషయంలో ఎంత అరాచకంగా వ్యవహరించారో.. గమనించిన వారు విస్తుపోతున్నారు.

అక్రమాలకు పాల్పడడం మాత్రమే కాదు.. వాటిని అనుమానిస్తూ.. ఏకంగా రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. వారినే మోసం చేయడానికి ఆయన చేసిన కుటిలయత్నాలు ఇప్పుడు విపులంగా బయటకు వస్తున్నాయి. సాధారణంగా కోర్టు ధిక్కరణ అంశాల్లోనే న్యాయపీఠం చాలా సీరియస్ అవుతుంటుంది. అలాంటిది.. పీఎస్సార్ ఏకంగా.. హైకోర్టును మోసం చేయడానికి చేసిన ప్రయత్నాలను ఎలా పరిగణిస్తుంది అనేది సంచలనాంశంగా మారుతోంది.

జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా సేవలందించి.. అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు.. అంతకుముందు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కూడా చేశారు. ఆ సమయంలో గ్రూప్ 1 పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. అభ్యర్థుల సమాధానపత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయించడంలోనే భారీగా అక్రమాలు జరిగినట్టుగా వెలుగుచూసింది. దీనిపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. మొత్తం అన్ని జవాబుపత్రాలను మాన్యువల్ విధానంలో మళ్లీ మూల్యాంకనం చేయించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.


మాన్యువల్ మూల్యాంకనం కూడా చేయించారు. అయితే ఈ ప్రక్రియమొత్తం ఒక బూటకమే. ఈ పని చేయడంలో ఏపీపీఎస్సీ అనుసరించాల్సిన అన్ని నిబంధనలను కూడా తుంగలో తొక్కారు. తన మాట విని తీరాల్సిందేనంటూ అధికార్లను అందరినీ బెదిరించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగుల పర్యవేక్షణలో కార్యాలయంలో గానీ, ప్రభుత్వ కళాశాలలో గానీ ప్యానెల్ రూపంలో ఎంపిక చేసిన యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా జరగాల్సిన పనిని.. పీఎస్సార్ ఆంజనేయులు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ క్యామ్ సైన్ మీడియా అనే ప్రెవేటు సంస్థ చేతుల్లో పెట్టారు. ఈ పని చేసినందుకు వారికి ఏకంగా 1.15 కోట్ల రూపాయలను సింగిల్ చెక్కు రూపంలో చెల్లించేశారు. వాస్తవంగా అందుకు 40 లక్షలు కూడా ఖర్చయి ఉండవని సమాచారం.

అన్నింటికంటె ఘోరం ఏంటంటే.. హాయ్ ల్యాండ్ రిసార్టుల్లో ఈ మూల్యాంకనం అనే ప్రహసనం నడిపించారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం అని తెలిసికూడా అలాగే చేశారు. పైగా మూల్యాంకనం శ్రద్ధగా చేయాల్సిన అవసరం లేదని.. డిజిటల్ పద్ధతిలో లో వచ్చిన మార్కులనే.. కాస్త అటుఇటుగా మాన్యువల్ విధానంలో కూడా వేసేస్తే సరిపోతుందని సదరు క్యామ్ సైన్ సంస్థ మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు కూడా తమ సిబ్బందితోనే ఆ పనిచేయించి.. ఆయన కోరినట్టుగా సమర్పించారు.

ఇవే ఫలితాలను ఆయన కోర్టుకు సమర్పించి.. హైకోర్టునే బురిడీ కొట్లించాలని ప్రయత్నించారు. ఈ బాగోతం మొత్తం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆల్రెడీ కాదంబరి జత్వానీ కేసులో రిమాండులో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులును ఈ ఏపీపీఎస్సీ కేసులో కూడా విచారించడానికి పోలీసులు పీటీవారెంటుకు కూడా అనుమతి తీసుకున్నారు. మరి పీఎస్సార్ ఆంజనేయులు పాల్పడిన అక్రమాలు ఇంకా ఎన్ని వెలుగుచూస్తాయో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories