విడదల మార్కు : దందాలలో సరికొత్త స్టాండ్!

అధికారంలో ఉన్న అవినీతిపరులైన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు తమ తమ పరిధిలో వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను లోబరుచుకుని లేదా బెదిరించి వారి నుంచి మామూళ్లు తీసుకోవడం కొత్త విషయం కాదు. కానీ చిలకలూరిపేట ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి హయాంలో గెలిచిన, ఆ తర్వాత మంత్రిగా కూడా అధికారం చలాయించిన విడదల రజని ఇలాంటి అధికారిక దందాలలో ఒక సరికొత్త స్టాండర్డ్ సృష్టించారు. మామూళ్లు మరీ ఇంత భారీగా ఉంటాయా అని సామాన్యులు నివ్వెరపోయే స్థాయిలో ఆమె తన నియోజకవర్గంలోని వ్యాపారులను దోచుకోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ పాలన కాలం నాటి అరాచకాలు అనేకం వెలుగు చూసినట్లే.. విడదల రజని దందాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు విడదల రజని మీదనే కాదు.. ఆమె అనుచరులు, సహకరించిన అధికారుల మీద కూడా ఏసీబీ కేసు నమోదు అయింది.

స్టోన్ క్రషర్ వ్యాపారం చేసుకుంటున్న లక్ష్మీబాలాజీ సంస్థ యాజమాన్యం వారు- గతంలో తమను ఏ స్థాయిలో బెదిరించారో, ఎంతెంత ముడుపులు సమర్పించారో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వారి ప్రాథమిక విచారణ తర్వాత మాజీ మంత్రి విడదల రజని అప్పట్లో ఆమె దందాలు, దోపిడీపర్వానికి రైట్ హ్యాండ్ గా నిలిచిన నిలిచి సహకరించిన సీనియర్ అధికారి జాషువా,  ఆమె మరిది గోపి తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే విడదల రజని మాత్రం తన మీద ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేయించారు అని ధ్వజమెత్తడం జరుగుతోంది.

స్టోన్ క్రషర్ వ్యాపారుల దగ్గరకు 2020 సెప్టెంబరులో రజని పీఏ రామకృష్ణ వెళ్లి.. మేడంను కలవాల్సిందిగా వారికి హుకుం జారీచేశారు. స్టోన్ క్రషర్ పై అధికారుల దాడులు జరగకుండా, మూయించకుండా ఉండాలంటే కలవాలని అన్నారు. యజమానులు ఆమెను కలిసినప్పుడు.. తన నియోజకవర్గంలో వ్యాపారానికి తనకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని, వివరాలు పీఏతో మాట్లాడాలని హెచ్చరించి పంపారు. పీఏ వారితో 5 కోట్ల రూపాయల రేటు నిర్ణయించారు.

ఆ తర్వాత ఆరు రోజులకే గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా.. భారీగా సిబ్బందితో స్టోన్ క్రషర్ పై ఏ ఫిర్యాదూ లేకపోయినా తనిఖీలకు వెళ్లి.. హడావుడి చేశారు.
తనిఖీలకు నెల తర్వాత.. తాను ఫైన్ లు విధిస్తే 50 కోట్లు కట్టాల్సి వస్తుందని, దాని బదులుగా రజని పీఏను కలిసినట్టుగా ఆమె కోరినట్టుగా 5 కోట్లు చెల్లించాలని జాషువా క్రషర్ యజమానుల్ని బెదిరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరగగా క్రషర్ యాజమాన్యం.. రజని ఆదేశాల మేరకు పురుషోత్తమపట్నంలోని ఆమె మరిది గోపిని 2021 ఏప్రిల్ 4న రాత్రి కలిసి రెండు కోట్లు ఇచ్చేశారు. జాషువాకు, గోపికి చెరో పదిలక్షలు అదనంగా ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ వ్యవహారం గురించి ఫిర్యాదు చేశారు. అయితే విడదల రజని మాత్రం.. తనమీద తప్పుడు కేసులు పెట్టినట్టుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అన్యాయంగా కేసులు పెట్టారని, ఆ వ్యక్తుల్ని తాను ఎన్నడూ చూడను కూడా లేదని ఆమె అంటున్నారు. ఈ కేసులో రజని పూర్తిగా ఇరుక్కున్నట్టేనని.. ఆమె కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories