ఇటీవల తాజాగా 16 కిలలో బరువు పెరగడం గురించి బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా భార్య పరిణీతి చోప్రా ఓపెన్ అయ్యింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న అమర్ సింగ్ చంకీల సినిమా కోసం తాను చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పుకొచ్చింది.
ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో సరైన కథలను ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చింది. ‘ఫ్యాన్స్ నా నుంచి మంచి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. దానికోసం హోం వర్క్ చేయాలని అనుకున్నాను. సవాళ్లతో కూడిన కథలను ఎంచుకోవడం మొదలు పెట్టాను. అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది.
‘అమర్ సింగ్ చంకీల’ కోసం నేను ఏకంగా 16 కిలోల బరువు పెరిగాను. ఎంతమంది ఇలా బరువు పెరిగేందుకు సిద్ధంగా ఉన్నారు? ఇలాంటి సాహసం చాలా తక్కువ మంది హీరోయిన్లు చేస్తారు. ఇండస్ట్రీ మొత్తంలో ఒకరో, ఇద్దరో దీనికి అంగీకరిస్తారు. అంకితభావం, నిబద్ధత కలిగిన హీరోయిన్లు మాత్రమే ఇలా చేయగలుగుతారు.
ఈ సినిమా నాకు అసాధారణ ప్రయాణం. లైవ్‌లో ఎలా పాడాలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. రిస్క్ తీసుకున్నాను కాబట్టే చిత్రం విజయం సాధించింది. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.