శవం దొరికింది.. రాజకీయానికి జగన్ రెడీ!

కొందరు నాయకుల వ్యవహార సరళి అలాగే ఉంటుంది. శవం దొరికితే చాలు దాని నుంచి గరిష్టంగా ఎంత వీలైతే అంత లబ్ధి పొందాలని ఆరాటపడతారు. దీన్నే శవరాజకీయం అంటారు. మామూలు పామరుల భాషలో అయితే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు. రాజకీయ నాయకులు పేలాల జోలికి వెళ్లరు గానీ శవం దొరికితే చాలు దాని ద్వారా ఎంత వీలైతే అంత రాజకీయ లబ్ధి పొందాలని ఆరాటపడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా వినుకొండలో ఒక వ్యక్తి చనిపోతే రాజకీయ హత్యగా రంగు పులిమి ఏకంగా ముఖ్యమంత్రి మీదే బురద చల్లడానికి ఆయన సాహసిస్తున్నారు. ఇలాంటి విమర్శలు ప్రజల దృష్టిలో అతిగా అనిపిస్తాయని కూడా ఆయన ఆలోచించడం లేదు.

వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే రషీద్ అనే వ్యక్తి హత్య బుధవారం రాత్రి జరిగింది. అతను పని ముగించుకుని మద్యం దుకాణం నుంచి బయటకు రాగానే, అతని కోసం వేచి ఉన్న పాత శత్రువు ఏసీ మెకానిక్ గా పని చేసే షేక్ జిలాని కొబ్బరి బోండాలు నరికే కత్తితో అతని నరికి చంపాడు.
వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. గతంలో రషీద్- జిలాని మీద దాడి చేసి కొట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బహిరంగంగానే వైరం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే జిలాని- రషీద్ ను అంతమొందించాడు. అతనిని అదుపులోకి తీసుకున్నామని కేసు విచారిస్తున్నామని ఏఎస్పి లక్ష్మీపతి చెబుతున్నారు.

అయితే మరణించిన రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు కావడంతో ఈ హత్య ద్వారా వీలైనంత రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ శాసనసభకు వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో బెంగళూరు ప్యాలెస్ కు పారిపోయి హాయిగా అక్కడ సేద్ద తీరుతున్న జగన్మోహన్ రెడ్డి తన యాత్రను మధ్యంతరంగా రద్దు చేసుకుని తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. గురువారం రోజు వినుకొండకు కూడా వెళ్ళనున్నారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో చాలా బీభత్స సంఘటనలు జరిగి, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన సందర్భాలలో కూడా స్వయంగా పరామర్శకు వెళ్లడానికి గంట కూడా ఖాళీ దొరకని జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు రషీద్ అనే వ్యక్తి పాత కక్షల కారణంగా హతమైతే దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి అచ్యుత్సాహం చూపిస్తున్నారు.

తమాషా ఏమిటంటే రషీద్ హత్య మీద జగన్మోహన్ రెడ్డి కనబరుస్తున్న శ్రద్ధ ఆయన గత ఐదేళ్లలో ఏనాడు కూడా తన సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి చూపించలేదు. ఇదే శ్రద్ధ బాబాయి హత్య మీద కూడా ఉండి ఉంటే అసలు హంతకులు ఎప్పుడో కటకటాల వెనక్కి వెళ్లి ఉండే వారని ప్రజలు అంటున్నారు. ఇంతగా ఒక మామూలు వ్యక్తిగత కక్షల హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చవకబారు ఆలోచనతో కూడుకున్నది అని ప్రజలు ఈసడించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories