చింత చచ్చినా పులుపు చావలేదని సామెత. 151 సీట్లతో ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక, 11 సీట్లకు పతనం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. దారుణ పరాభం ఎదురైనప్పటికీ ఆయనలోని అహంకారం మాత్రం తగ్గడం లేదు. ఏపీలో తన ముద్రగల రాజకీయాలు చేయడం తప్ప.. రెండో తెలుగురాష్ట్రం తెలంగాణలో కనీసం కమిటీలు వేయడానికి కూడా గతిలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దేశంలోనే బలమైన పార్టీగా తయారు చేయాలనే దృఢసంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. కేవలం 175 సీట్లు ఉండే రాష్ట్రానికి పరిమితమైన ప్రాంతీయ పార్టీ దేశంలోనే బలమైన పార్టీగా ఎలా ప్రొజెక్టు కాగలదనే కనీస ఇంగితం కూడా జగన్ కు ఉన్నట్టుగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి.. పార్టీ పునర్నిర్మాణం అనే పేరుమీద వివిధ అనుబంధ విభాగాలకు కొంతకాలంగా సారథులను నియమిస్తున్నారు. కార్యవర్గంలో కొన్ని కీలకమార్పులు చేస్తున్నారు. నామ్ కే వాస్తే మార్పులే జరుగుతున్నాయి తప్ప.. క్రియాశీలంగా అసలు నాయకత్వ బాధ్యతల్లో ఉండే స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయనే అభిప్రాయం కార్యకర్తలకే కలగడం లేదు. ఇలా ఉండగా జగన్ మాత్రం దేశంలోనే బలమైన పార్టీగా వైసీపీని తయారుచేద్దాం అంటున్నారు.
జగన్ ఇంకా చిత్రంగా చెబుతున్న సంగతులేంటంటే.. ఆయనను, ఆయన పార్టీని అభిమానించే కార్యకర్తలు లక్షల్లో, ఓటర్లు కోట్లలో ఉన్నారట. వారందరికీ మంచి చేయాలంటే.. ఆయన సీట్లో ఉండాలట. కాబట్టి మళ్లీ అధికారంలోకి రావాలని పిలుపు ఇస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఎవరికెంత మేలు చేశారో.. ఇప్పటికీ బిల్లులు రాకుండా కొట్టుమిట్టాడుతున్న పార్టీ నాయకులే సరిగ్గా చెప్పగలరు. అధినాయకులతో సంబంధాలు ఉన్న బడా కాంట్రాక్టర్లకు తప్ప.. పార్టీ వారికి కూడా బిల్లులు ఇవ్వనేలేదు. మంచి చేయడం అనే ముసుగులో ఆయన ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియదు.
ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసింది.. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.. అంటూ రోజులు నెట్టుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి.. వాస్తవ పరిస్థితిని గ్రహించకపోతే.. ఆయన ఎప్పటికీ.. పతనం దిశగానే వెళుతుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.