దాదాపు 3500 కోట్ల రూపాయలు స్వాహా చేసిన మద్యం కుంభకోణం కేసులో కర్త కర్మ క్రియ అయిన సూత్రధారి కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తుల విషయంలో హైకోర్టు తమ నిర్ణయాన్ని తెలియజేసింది. ఇప్పటిదాకా కుంభకోణంలో పాత్ర ఉన్నట్టుగా తేలిన అప్పటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం పేషీలో కీలక వ్యక్తి ధనంజయరెడ్డి, అలాగే భారతి సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ లను అరస్టు చేయకుండా రక్షణ కల్పించలేం అని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. వీరిని కూడా సిట్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే తప్ప.. 3500 కోట్ల కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఎవ్వరు? అనే స్పష్టత రాదని పలువురు భావిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన తర్వాత.. ఏపీ సర్కారు కొత్త లిక్కర్ పాలసీని రూపొందించింది. ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి తొలిరెండు కీలక సమావేశాలు అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగాయి. పాలసీ ఎలా ఉండాలి.. తయారీదార్లనుంచి తాము వసూలు చేసే లంచాలు కిక్ బ్యాక్స్ ఎలా వసూలు చేయాలి.. లాంటి విధానాలన్నీ ఈ భేటీల్లో చర్చించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇంకా.. సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ తదితరులందరూ కీలక పాత్ర పోషించినట్టు తేలింది. రాజ్ కెసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి విచారించినప్పుడు.. మొత్తంగా కలిపి నెలకు రూ.50-60 కోట్ల రూపాయలు డిస్టిలరీలనుంచి వసూలు చేసేవారని, అంచెలంచెలుగా వివిధ మార్గాల్లో అంతిమ లబ్ధిదారులకు సంబంధించిన వ్యక్తులకు చేర్చేవారని తేలింది. ఆ రకంగా ఫైనల్ గా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీలకు సొమ్ము చేరేదని తేల్చారు. అయితే వారి పేర్లు ఇంకా నిందితుల జాబితాలో చేర్చడం జరగలేదు.
తాజాగా తమ పేర్లను కొందరు నిందితులు వెల్లడించినందున.. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ, అలాగే మధ్యంతర ఉత్తర్వులతో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ వాదనలు వినకుండా వీరికి ముందస్తు బెయిలు ఇవ్వడం సాధ్యం కాదంటూ కోర్టు పేర్కొన్నది. అదే సమయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించే ఉత్తర్వులు కూడా ఝఇవ్వలేం అని పేర్కొంది. ఈ ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయితే తప్ప.. అసలు లిక్కర్ స్కామ్ లో కాజేసిన సొమ్ము అంతిమంగా ఎవరికి చేరింది.. అనే సంగతిపై స్పష్టత రాదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురి విషయంలో తర్వాతి చర్యలకు ఉపక్రమించకుండా.. సిట్ పోలీసులు కాలయాపన చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా కొందరిలో కలుగుతున్నాయి.