ఆ ఇద్దరి అరెస్టు: ఇక జగన్ పేరే తరువాయి!

మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ స్కామ్ లో ఇప్పటిదాకా 33 మంది నిందితులు ఉన్నారు. ఏ1 నుంచి ఏ33 వరకు ఏడు అరెస్టులు జరిగాయి. ఎంతో కీలకమైన ఈ ఏడు అరెస్టుల ద్వారానే.. మొత్తం ఈ  బాగోతానికి సంబంధించిన సమస్త వివరాలు, సమగ్రంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నదని సిట్ పోలీసులు భావిస్తున్నారు. వేల కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా కొత్త లిక్కర్ పాలసీ తయారుచేయాలనే మార్గాన్ని నిర్దేశించడం దగ్గరినుంచి.. అంతిమలబ్ధిదారుగా ఆ సొమ్ములను రకరకాల రూపాల్లో పొందడం వరకు- తన చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి అధీకృతమైన సమాచారం ఈ అరెస్టు అయిన నిందితుల ద్వారా బయటకు రావడం అనే లాంఛనం ఒక్కటే ప్రస్తుతానికి మిగిలి ఉంది. తాజాగా శుక్రవారం జరిగిన అరెస్టులతో ఆ పర్వం కూడా పూర్తవుతుందని పోలీసులు నమ్ముతున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయులు అయిన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనంజయరెడ్డి ఇద్దరినీ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు వారికి శుక్రవారం వరకే అరెస్టు నుంచి రక్షణ కల్పించినప్పటికీ.. విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించడంతో వారు మూడురోజులుగా సిట్ పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. కాగా, శుక్రవారం వారి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆ సమయానికి ఆ ఇద్దరూ సిట్ పోలీసుల వద్దనే ఉన్నారు. మొత్తం మూడురోజుల పాటు, దాదాపు 25 గంటలసేపు వారికి 300 ప్రశ్నల వరకు సంధించినప్పటికీ.. వారు దేనికీ కూడా సూటిగా, స్పష్టంగా జవాబులు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన, వసూళ్ల సొమ్ము వేల కోట్లు అయినా సరే.. వివిధ రూపాల్లో డొల్ల కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించగల చాకచక్యం ఉన్న భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీని పోలీసులు ముందే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు కీలక నిందితుల ద్వారా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే సంగతి బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

ఏ1 నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. అరెస్టు అయిన తర్వాత పోలీసు విచారణలో .. జగన్ సూచనల మేరకే.. పార్టీ కోసం భారీగా ఫండ్ సమీకరించేలాగా.. లిక్కర్ పాలసీని రూపొందించినట్టుగా వెల్లడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే వసూళ్ల నెట్వర్క్ కు రాజ్ కెసిరెడ్డి కేంద్రబిందువు కాగా, వసూలైన సొమ్ములన్నీ ఈ ముగ్గురికే చేరేవి అని దర్యాప్తులో తేలింది. వీరిద్వారా ఎలా ఇతర మార్గాల్లోకి వెళ్లాయి. ఎలా హవాలా రూపంలోకి మళ్లాయి అనేది పోలీసులు ధ్రువీకరించుకోనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories