కల్తీ స్పష్టం.. పాపులు ఎవరెవరనేది మాత్రం తేలాలి!

‘అబ్బే కల్తీ అనేది అసలు జరగనే లేదు. ఎలాంటి సిట్ వేసినా.. ఏ అధికారులు వచ్చి దర్యాప్తు చేసినా.. ఆధారాలను పరిశీలించి ఇక్కడ అసలేం తప్పు జరగలేదని నివేదిక ఇవ్వడం తప్ప ఇంకోటి చేయలేరు. తప్పుజరిగిందని నివేదిక ఇస్తే వారి మీద దేవుడికి కోపం వస్తుంది.. వారి సంగతి ఆయన చూసుకుంటాడు..’ అని మేకపోతు గాంభీర్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నాయినొక్కులు నొక్కుతూ ఉండవచ్చు గాక.. కానీ నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. దాన్ని రుజువు చేసే ఆధారాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సుప్రీం ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటుకాకముందే.. మీడియా ద్వారా వెల్లడవుతున్న కొన్ని వాస్తవాలు.. కల్తీని ధ్రువీకరిస్తున్నాయి. ఇక తేలవసిందెల్లా కేవలం ఒక్కటే. కల్తీ కేవలం డెయిరీ నిర్వాహకులు చేసిన తప్పుడు పని మాత్రమేనా? లేదా, ఇలాంటి తప్పుడు వ్యక్తులకు కాంట్రాక్టులు కట్టబెట్టి టీటీడీ బాధ్యులు కూడా ఎవరైనా అనుచిత మార్గాల్లో లబ్ధిపొందారా? అనేది మాత్రమే!

తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ కిలో రూ.319.80 లవంతున పది లక్షల కిలోల నెయ్యి టీటీడీకి సరఫరా చేయడానికి కాంట్రాక్టు పొందింది. అలాగని వీరికి అంత ఉత్పత్తి చేయగల సామర్థ్యం కూడా లేదు. వారు తిరుపతి జిల్లా పునబాక వద్ద ఉన్న వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి కొని టీటీడీకి సప్లయిచేశారు. కొన్ని ట్యాంకర్లు నేరుగా వైష్ణవి నుంచే తిరుమలకు వెళ్లాయి కూడా. అయితే.. ఇంతాకలిపి సదరు వైష్ణవి డెయిరీకి కూడా ఇన్ని లక్షల కిలోల నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. వారు పునబాకకు 2300 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రూర్కీ జిల్లాలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి భారీ పరిమాణంలో వైష్ణవి డెయిరీ కొన్నది.

ఇక్కడే అసలు మతలబు ఉంది. భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ కిలో రూ.355 వంతున కొన్నది. 2300 కిలోమీటర్ల దూరం నుంచి తమ పునబాక యూనిట్ కు తెప్పించి, ఆ పిమ్మట 500 కిమీల దూరంలో తమిళనాడు దిండిగల్ లో ఉన్న ఏఆర్ డెయిరీ వారికి కిలో రూ.318.57 వంతున సరఫరా చేసింది. ఏఆర్ డెయిరీ, తమకు వైష్ణవినుంచి వచ్చిన ట్యాంకర్లకే కొత్త వే బిల్లులు తయారుచేసి కిలో మీద 1.23 రూపాయల లాభం వేసుకుని, టీటీడీతో కాంట్రాక్టు ప్రకారం కిలో రూ.319.80 వంతున వారికి సరఫరా చేసింది. భోలేబాబా నుంచి కిలో రూ.355 కు కొన్నటువంటి వైష్ణవి.. తాము మాత్రం కిలో రూ.318.57 వంతున ఏఆర్ డెయిరికీ ఎలా ఇవ్వగలిగింది? ఇక్కడే అసలు దందా మొత్తం దాగి ఉందన్నమాట.

ఉత్తరాఖండ్ రూర్కీ జిల్లాలోని డెయిరీలు నెయ్యి మాఫియాకు  పెట్టింది పేరు. కల్తీలకు పేరుమోసిన వారు. అక్కడి భోలేబాబా డెయిరీలో విపిన్ జైన్, పొమిల్ జైన్ లు డైరక్టర్లు. వీరు 2024 జనవరి 18న తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డెయిరీలో డైరక్టర్లుగా చేరారు. ఇంత సుదీర్ఘమైన కథ నడిపారు.

ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందనే సంగతి బయటకు రాగానే.. రాష్ట్ర జీఎస్టీ అధికారులు తమ దారిలో దర్యాప్తు సాగించారు. ఆ డెయిరీ వారి లెక్కలను పరిశీలించారు. వారు ఎక్కడినుంచి నెయ్యి కొంటున్నారు.. ట్యాంకర్లు ఎలా వెళుతున్నాయి తదితర వివరాలన్నీ టోల్ గేట్ల సాక్షిగా వారి నివేదికలోకి వచ్చాయి. కల్తీ అనేది స్పష్టం అయింది. కాకపోతే.. కోట్లరూపాయలు కాజేయడానికి ఉద్దేశించిన ఇలాంటి కల్తీ దందాను చేయడానికి పాలకమండలి పెద్దలు ఎవరెవరు ఆ డెయిరీలకు సహకరించారు అనేది ఒక్కటే ఇప్పుడు లెక్కతేలాలి.

టీటీడీ నెయ్యి కొనుగోలుకు పాటించే నిబంధనలు అనేకం మార్చి మరీ ఏఆర్ డెయిరీకి పదిలక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారంటే.. అది మొత్తం 32 కోట్ల రూపాయల డీల్. పాలకమండలి పెద్దల ప్రమేయం లేకుండా నిబంధనల మార్పు సహా అంత సులువుగా జరుగుతుందని అనుకోవడం భ్రమ. సో, కల్తీ జరిగిన సంగతి తేలిపోయినట్టే. ఇకపోతే.. సుప్రీం ఆదేశించిన సిట్ ఏర్పాటు అయితే.. ఈ పాపానికి పాల్పడిన వారు ఎవరెవరు? వాటాలు పంచుకున్న పెద్దలు ఎవరెవరు? అనేది మాత్రమే నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories