తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ సారథ్యం పట్ల పార్టీ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యకర్తలను కలుపుకుపోతున్న తీరు, కార్యకర్తల కుటుంబాల బాగోగుల గురించి పట్టించుకుంటున్న తీరు పట్ల వారిలో సంతృప్తి వ్యక్తం అవుతోంది. కార్యకర్తలు లోకేష్ కు నీరాజనాలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ పార్టీ బాధ్యతలు చూస్తున్న తొలినాటినుంచి చూపిస్తున్న శ్రద్ధ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తోంది.
తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల, పొరుగు రాష్ట్రాలు, అండమాన్ ప్రాంతాలతో కలిపి ఇప్పటికే దాదాపు 90 లక్షలకు మించి సభ్యత్వాలు నమోదు అయ్యాయి. సభ్యత్వనమోదుకు గడువు కొంత పొడిగించడంతో.. ఈసారి సభ్యత్వాలు కోటి మైలురాయిని దాటుతాయనే అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తం అవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ కోటి సభ్యత్వాల మైలురాయిని చేరుకోవడం అనేది మన దేశ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు. అయితే.. కేవలం సభ్యత్వాలు మైలు రాయి చేరడం మాత్రమే కాదు. కోటిమంది క్రియాశీల కార్యకర్తలకు కూడా పార్టీ తరఫునే ప్రమాద బీమా కల్పిస్తూ నారా లోకేశ్ యునైటెడ్ ఇండియా కంపెనీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. జనవరి ఒకటోతేదీనుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా బీమా చేయించడం విశేషం. కోటిమంది కార్యకర్తలకు ఒకేసారి బీమా చేయించడం అనేది దేశ రాజకీయ పార్టీల చరిత్రలోనే మొట్టమొదటిసారి అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఏడాదిపాటు బీమా సౌకర్యం వర్తించడానికి పార్టీ తొలివిడతగా 42 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించింది.
ఇప్పటి రికార్డు ఓకే గానీ.. నారా లోకేష్ పార్టీ వ్యవహారాలు చూడడం ప్రారంభించిన తర్వాతే.. కార్యకర్తల సంక్షేమం కోసం అసలు బీమా చేయడం అనేది ప్రారంభం అయింది. దీనిని పూర్తిగా లోకేష్ బుర్రలో పుట్టిన ఆలోచనగా చెబుతుంటారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కార్యకర్తల సంక్షేమం కోసం 138 కోట్లరూపాయలు ఖర్చుచేసింది. కార్యకర్తలు హఠాన్మరణానికి గురైతే వారి పిల్లలకు చదువులు చెప్పించడం వంటి పనులన్నీ పార్టీ బాధ్యతగానే చేస్తున్నారు. దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ ఆఫీసులో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటుచేశారు. మొత్తానికి కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాల పట్ల పార్టీ వారు నీరాజనాలు పడుతున్నారు.