ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2024 ల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఙతలు తెలపడంతో పాటు పెన్షన్ల ను పంపిణీ చేసేందుకు తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఆయన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులకు పింఛన్లు అందజేశాక అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.
ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి, వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా.. ఆ శాఖలో నిధులు లేవని.. అందుకే గత నెలకు సంబంధించిన జీతం తీసుకోనని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో, ఎక్కడికి పోయాయో తెలియడం లేదని అన్నారు.
పంచాయతీ రాజ్ శాఖలో తనవైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని పవన్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తానున్నట్లు పవన్ చెప్పారు. మంత్రిగా సంబంధిత శాఖలను తీర్చిదిద్ది, పిఠాపురం నియోజకవర్గంను దేశానికి రోల్ మోడల్ గా చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక తనకు లేదని.. తనకు కావాల్సింది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు.