జగనన్న పగబడితే  అంతే.. తగ్గేదే లేదు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంతానికి పోయారంటే.. తగ్గేదే లేదని ఏ అంచులవరకైనా వెళ్లి అంతు తేల్చుకోవడానికి ప్రయత్నిస్తారని.. ఓటమి ఎదురైనా సరే పెద్దగా బాధపడరని ఆయనను ఎరిగిన వారు అంటూ ఉంటారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి.. హైకోర్టులో పిటిషన్లుగా దాఖలైన అనేక అభ్యంతరాలు విషయంలో గత అయిదేళ్లలో ఇలాగే జరిగింది. జగన్ దూకుడుగా ఒక నిర్ణయం తీసుకోవడం, దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్లడం.. హైకోర్టులో ప్రభుత్వం కేసు ఓడిపోయినా సరే.. ఆ నిర్ణయాల్ని అమలు చేయకుండా సుప్రీం కోర్టుకు వెళ్లడం మళ్లీ ఓడిపోవడం ఇలా అనేకం జరిగాయి. తన నిర్ణయాల విషయంలోనే అంత పట్టుదలగా ఉండే జగన్మోహన్ రెడ్డి, తాను పగబట్టిన మనుషుల విషయంలో ఎలా ప్రవర్తిస్తారు?; ఆయన తీరు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పగబట్టారు. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి పగబట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి ఆరోపణల మీద ఆయనను సస్పెండ్ చేశారు. ఆయన న్యాయపోరాటం సాగించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కు వెళ్లి పునర్నియామకానికి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయనకు యూనిఫాం కూడా ఉండని ఒక అప్రాధాన్య పోస్టు కట్టబెట్టింది ప్రభుత్వం. తనకు యూనిఫాం ఉన్న పోస్టు ఇవ్వాలని ఆయన కోరారు.  తర్వాత మళ్లీ సస్పెండ్ చేశారు. మళ్లీ న్యాయపోరాటానికి వెళ్లారు. ఇలా పలు మలుపులు తిరిగిన తర్వాత.. ఏబీ వెంకటేశ్వరరావుకు తక్షణం పోస్టింగు ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈనెల 8న ఉత్తర్వులు రాగాఅవి చేతికందే సరికి మూడు రోజులు పట్టింది. ఆతీర్పు కాపీని సీఎస్ కు సమర్పించి ఏబీ వెంకటేశ్వరరావు తనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అయితే సీఎస్, ఈసీ అనుమతి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా సీఎంకు పంపినట్లు తెలుస్తోంది. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్ కు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఢిల్లీ ఈసీ ఎదుట హాజరుకావడానికి ముందే.. హైకోర్టు వెకేషన్ బెంచ్ లో ఏబీ ప్రాసిక్యూషన్ కు పిటిషన్ వేశారు. ఇది ఆరోజు అడ్మిట్ కాలేదు.

ఒకవేళ ఢిల్లీ వెళ్లినప్పుడు ఈసీ తన మీద వేటు వేస్తే తర్వాత వచ్చే కొత్త సీఎస్ కూడా ఏబీవీకి పోస్టింగు ఇవ్వకుండా ఇలా లీగల్ లిటిగేషన్ పెట్టాలని చూశారు. ఈనెలాఖరుకు ఏబీవీ పదవీవిరమణ చేయాల్సి ఉంది. ఆయనకు పోస్టింగు ఇవ్వకుండానే రిటైర్ చేయించాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారం ఇన్ని మలుపులు తిరుగుతోంది.

తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారనే అనుమానంతో ఒక అధికారి మీద పగబడితే.. ఎంతవరకైనా వెళ్తాం అని జగన్ సర్కారు తమ చర్యలతో నిరూపిస్తున్నట్టుగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories