కొండా అంతే : నాగార్జునకు మాత్రం నో సారీ 

తనను సోషల్ మీడియలో ట్రోల్ చేసినందుకు ప్రతీకారంగా.. కేటీఆర్ కు సినిమా హీరోయిన్లకు ముడిపెడుతూ కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజేసిన అగ్గి ఇంకా రగులుకుంటూనే ఉంది. ఆమె సంజాయిషీ కూడా చెప్పారు గానీ మంటలు మరింత పెద్దవయ్యేలా కనిపిస్తున్నాయి. కొండా సురేఖ మాటలను అటు హీరో నాగార్జున, ఆయన మాజీ కోడలు సమంత ఇద్దరూ ఖండించినప్పటికీ.. కొండా సురేఖ కేవలం సమంతకు మాత్రం సంజాయిషీ చెప్పడం.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ప్రకటించడం గమనిస్తే.. ఆమె నాగార్జునతో ఇంకా సున్నం పెట్టుకోవడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది.

కొండా సురేఖ తాజాగా మరొక ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యవహారాల గురించి చేసిన విమర్శలలో సమంత పేరు కూడా ప్రస్తావించినందుకు ఆమె సంజాయిషీ ఇచ్చారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే తప్ప నీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా’ అంటూ సమంత ఉద్దేశించి కొండా సురేఖ ట్వీట్ చేశారు. అంతే తప్ప సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లవలసిందిగా భర్త నాగచైతన్య, మామ నాగార్జున ఒత్తిడి చేశారంటూ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె సారీ చెప్పేనేలేదు. రాజకీయాల్లోకి సినిమా సెలబ్రెటీలను లాగవద్దు అన్న హీరో నాగార్జునకు సారీ చెప్పలేదు. సమంతకు మాత్రమే ఆమె చెప్పిన సంజాయిషీ సినిమా పరిశ్రమలో మరొక సంచలన చర్చ లాగా మారుతోంది.

‘మీరు మనస్థాపానికి గురైనట్లయితే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అని కొండా సురేఖ ప్రకటించారు. నిజానికి సురేఖ చేసిన వ్యాఖ్యలు సమంతకు చేసే నష్టం కంటే- నాగార్జునకు చేసిన నష్టమే ఎక్కువ. సమంత ఆత్మగౌరవాన్ని కాపాడే లాగానే సురేఖ చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ నాగార్జున విషయంలో అవి చాలా హేయమైన విమర్శలు! అయితే సంజాయిషీలో కూడా సురేఖ సమంతను ప్రస్తావించారే తప్ప నాగార్జునకు నామమాత్రంగానైనా ఒక సారీ చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

నాగార్జున కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలాగా కొండా సురేఖ మాటలు ఉన్నాయే తప్ప.. సమంతను కించపరిచేలా లేవు. కానీ ఆమె సమంతకు సారీ చెప్పి, నాగార్జున విషయంలో కిమ్మనకుండా ఉండిపోవడం ఆ వెటరన్  హీరోకు ఇంకా పెద్ద అవమానమే అని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories