ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు!

ఇప్పటి రాజకీయ నాయకులలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూటే సెపరేటు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడే, నిర్మొగమాటంగా వ్యవహరించే నాయకుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులలో కూడా- అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆయన ఎన్నడూ వెనకాడ లేదు. అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఒక సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. తన పేరు చెప్పుకొని నియోజకవర్గంలో ఎవ్వరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సరే వారికి లక్షల్లో జరిమానాన్ని విధిస్తానంటూ కోటంరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజులలో కేవలం ఇసుక వ్యాపారంలో అక్రమ దందాలు అనేవి ఆ పార్టీని ఎంతగా భ్రష్టు పట్టించాయో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇసుక అక్రమ వ్యాపారాల వెనుక ఎమ్మెల్యేల హస్తమే ఉండేది. అయితే అదే కారణం చేత వాళ్లు అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అలాంటి నష్టం తమ పార్టీకి జరగకుండా, అలాంటి చెడ్డపేరు తమ నాయకులకు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఉచిత ఇసుక పంపిణీ వ్యవహారాల్లో తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆదేశించారు.

చంద్రబాబు సూచనలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా ఉంది. అధినేత ఆదేశాలకు ఆయన కొద్దిగా మెరుగైన రూపం ఇచ్చారు కూడా. ఇసుక వ్యాపారంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళయితే లక్ష జరిమానా, తెలుగుదేశం వాళ్ళు అయితే రెండు లక్షల రూపాయలు జరిమానా విధిస్తానంటూ ఆయన ప్రకటించడం గమనార్హం. అదే తరహాలో ఎమ్మెల్యే అయిన తన పేరు చెప్పుకొని ఎవరైనా ఎలాంటి అక్రమాలకు తప్పుడు పనులకు పాల్పడాలని ప్రయత్నించినా వారికి 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తానంటూ శ్రీధర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మొత్తానికి శ్రీధర్ రెడ్డి వ్యవహార సరళి ఇప్పటి రాజకీయాలలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories