చంద్రబాబునాయుడు సుదీర్ఘ అనుభవంలో గడించిన రాజనీతిలోని పరిణతి.. తిరుపతి పరిణామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. తిరుమల కొండల పాదాల చెంత నిర్మాణాల కోసం ముంతాజ్ హోటల్ పొందిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, ఈ సున్నితమైన అంశాన్ని డీల్ చేసిన విధానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. తిరుమల ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి భంగం వాటిల్లకుండా ఒకవైపు ముంతాజ్ హోటల్ కు అనుమతులు రద్దు చేస్తూనే, మరొకవైపు.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల ప్రాజెక్టులు తిరిగి వెళ్లిపోయేలా చేశారనే అపకీర్తి తన ఖాతాలో జమకాకుండా.. మరొక చోట స్థలం కేటాయించేలా వారిని ఒప్పించడం ఖచ్చితంగా చంద్రబాబు పరిణతికి నిదర్శనం అని అంటున్నారు.
ఏడుకొండలను ఆనుకుని తిరుపతిలో ఉన్న ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఒబెరాయ్ గ్రూపునకు చెందిన ముంతాజ్ హోటల్ కు జగన్ కేటాయించారు. నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. తిరుమల పాదాల వద్ద ఏర్పాటయ్యే స్టార్ హోటల్ మద్యం, మాంసంలతో పాటు సకల అరాచకాలకు కేంద్రంగా మారుతుందని.. ఇది భక్తుల విశ్వాసాన్ని గాయపరుస్తుందని హిందూ సంస్థల నుంచి భారీగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బోర్డు సభ్యుడు బిజెపి నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై పోరాటం ప్రారంభించారు. జగన్ సర్కారు అప్పట్లో హిందూ సంఘాల అభ్యంతరాలను పట్టించుకోలేదు.
ఇప్పుడు చంద్రబాబు దృష్టికి ఈ వివాదం వెళ్లిన తర్వాత.. తిరుమల ప్రాంతాన్ని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని, వ్యాపార కార్యకలాపాలకు నెలవు చేయరాదని చెబుతూ చంద్రబాబు అనుమతులు రద్దు చేశారు. ముంతాజ్ హోటల్ తో పాటు, దేవ్ లోక్ ప్రాజెక్టుకు 10.32 ఎకరాలు, ఎంఆర్కేఆర్ సంస్థకు మరోర 5 ఎకరాల కేటాయింపులను కూడా రద్దు చేశారు. అయితే.. జగన్ సర్కారు హయాంలో కూడా ఇలాంటి నిర్ణయాలు అనేకం జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వాటికి కేటాయింపులు రద్దు చేస్తూ జగన్ వారి మీద పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఆ రకంగా ఆయన రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులను వెనక్కు తరిమేశారనే పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు అలాంటి చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. ముంతాజ్ హోటల్ వారికే ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని ప్రతిపాదించి.. అందుకు వారి ఒప్పుకోలు కూడా సంపాదించారు.
ఇలా చంద్రబాబులోని పరిణతి గల రాజనీతి కారణంగానే.. హోటల్ ప్రాజెక్టు వెనక్కు వెళ్లకుండా.. అలాగని, తిరుమల ప్రాభవాన్ని దెబ్బతీయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారని పలువురు అంటున్నారు.