సింగపూర్ లో పాఠశాల వారి సమ్మర్ క్యాంప్ లో తన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్నిప్రమాదం బారిన పడే సమయానికి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మన్యం పల్లెల పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆయనకు కొడుకు అగ్నిప్రమాదానికి గురైనట్టుగా సమాచారం వచ్చింది. అప్పటికప్పుడు అక్కడినుంచి విశాఖ దాకా ప్రత్యేక హెలికాప్టర్లు, విశాఖనుంచి సింగపూరుకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేసుకుని వెళ్లడం అనేది ఆయనకు పెద్ద పని కాదు. కానీ.. ఆయన రాత్రి తొమ్మిదిన్నరకు విమానంలో సింగపూరుకు బయల్దేరి వెళ్లారు. ఎందుకు?
కేవలం మన్యం పల్లెల ప్రజలకు ఇచ్చిన మాట కోసం.. పవన్ కల్యాణ్ ఆగిపోయారు. కొడుకుకు ప్రమాదం జరిగిన సమాచారం తెలిసిన వెంటనే బయల్దేరాల్సిందిగా అధికారులు ఆయనకు సూచించినప్పటికీ.. పవన్ కల్యాణ్ స్వయంగా వారిని వారించారు. కురిడి గ్రామ ప్రజలకు తాను మాట ఇచ్చానని, వారి గ్రామానికి వెళ్లిన తర్వాతనే.. బయల్దేరి సింగపూరు వెళతానని పవన్ వారితో అన్నారు.
అలా కాకుండా.. కొడుకు ప్రమాదం జరిగిన వెంటనే.. పవన్ కల్యాణ్ వెనువెంటనే సింగపూరు వెళ్లిపోయి ఉన్నంత మాత్రాన కురిడి గ్రామ ప్రజలు ఆయనను ద్వేషిస్తారా? ఆయన పట్ల అపనమ్మకం పెంచుకుంటారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు తమ నాయకుడు.. అని నిందిస్తారా? అవకాశం లేదు. జరిగిన ప్రమాదం సంగతి అందరికీ తెలిసినదే గనుక.. ఆయన పట్ల ఎవ్వరికీ మనస్తాపం కలుగదు.
సింగపూరు వెళ్లి కొడుకును పరామర్శించి వచ్చిన తరువాత.. పవన్ కల్యాణ్ నిదానంగా మరొకరోజు కురిడి గ్రామానికి వచ్చి, అక్కడి ప్రజలతో ప్రశాతంగా కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే కూడా సరిపోయేది. కానీ, పవన్ కల్యాణ్ అలాంటి అవకాశం కూడా తీసుకోలేదు. అది ఆయనకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ఇప్పుడు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
కొడుకుకు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని, మరీ పెద్ద ప్రమాదం కాదనే క్లారిటీవచ్చిన తర్వాత.. సవ్యంగా చికిత్స అందుతున్నదనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రజలలో ఆయన పట్ల నమ్మకాన్ని పెంచింది. కాగా కురిడి గ్రామంలో పవన్ మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుంకర మెట్ట వద్ద చెక్క వంతెనను ప్రారంభించారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉద్యానపంటల ద్వారా వారికి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పారు. మన్యం జిల్లా తర్వాత , మధ్యాహ్నం తర్వాత విశాఖ జూ సందర్శనను మాత్రం రద్దు చేసుకుని, ఆ రాత్రికే ఆయన బయల్దేరి ప్రత్యేకవిమానంలో హైదరాబాదు వెళ్లడం గమనార్హం.