తెతెదేపా.. మళ్లీ సత్తా చూపించడం సాధ్యమే!

తెలంగాణ రాజధాని హైదరాబాదు నగర మునిసిపల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ తమ ఉనికిని చాటుకుంటుందా? రాష్ట్ర విభజన తర్వాత క్రమక్రమంగా తెలంగాణలో ప్రభావం కోల్పోయిన తెలుగుదేశం,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో మెరుగైన ప్రదర్శన చేస్తుందా? అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం లాగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి దారుణంగా పతనం కావడం,  కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం,  భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో ఎంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో..  కొద్దిగా ఫోకస్ పెడితే తెలుగు దేశానికి కూడా మంచి రోజులు వస్తాయని పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం దక్కుతుందని అంత సులువుగా చెప్పలేము.  కానీ ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కాస్త మెరుగైన స్థితికి చేరుకుని.. సంకీర్ణాలు ఏర్పడే అవకాశం ఉన్న రాష్ట్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించగల స్థితికి వస్తుంది అనే ఆశ మాత్రం పలువురు నాయకులలో ఉంది.  రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ పనులలో చాలా కారణాల వలన దెబ్బతింది.  తెలంగాణను సాధించిన రాష్ట్రం కింద గుర్తింపుతో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు,  వారి ఫస్ట్ ఫోకస్ తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించడం మీదనే సాగింది.  టిడిపి తరఫున గెలిచిన వారిని చాలామందిని గులాబీ దళంలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కేసీఆర్.  ఆ తర్వాత ఎన్నికలకు పార్టీ అస్తిత్వం పరిమితం అయింది.  తర్వాత కనుమరుగయింది.

 ఇప్పుడు పరిస్థితి వేరు.  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే సమూలంగా మారుతున్నాయి.  2023 ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.  దారుణంగా పతనమైన బారాస నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉంది.  బిజెపి బలం కూడా పెరుగుతుంది.  ఒకే పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుంది అనే రోజులు తెలంగాణలో మారిపోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అవుతాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ బలపడుతుంది.  హైదరాబాదు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు తిరిగి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడటం ఒక శుభ పరిణామం. ఆయన సారధ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికలలో తెలుగుదేశం తన ఉనికి చాటుకుంటుందని నమ్మకం పలువురు నాయకులకు కలుగుతుంది.  తెలుగుదేశం నుంచి ఎంతమంది వెళ్లిపోయినప్పటికీ ఇంకా నాయకుల కార్యకర్తల బలం స్థిరంగానే ఉన్నదని వారు నమ్ముతున్నారు.  ప్రత్యేకించి రాజధాని నగరంలో తెలుగుదేశం ఓటు బ్యాంకు కూడా చెప్పుకోదగినంత ఉందని అనుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికలు తెలంగాణలో తెలుగుదేశం తిరిగి పాదుకొనడానికి ఉపయోగపడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories