టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు హీరోలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ హీరోకి, అభిమానులకు గుర్తిండిపోయే ఒకే సినిమా ఉండటంతో అరుదు. నందమూరి అభిమానులకు అలాంటి సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘టెంపర్’ అనే చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ కెరీర్ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న వేళ, దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘టెంపర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా.. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు పూరీ తనదైన పద్ధతిలో ఈ కథను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఇక మాస్‌కు ట్రేడ్ మార్క్ లాంటి ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన అభిమానులను కాలర్ ఎత్తుకునేలా చేస్తానని మాట ఇచ్చాడు.
కట్ చేస్తే.. ‘దయా గాడి దండయాత్ర’ అంటూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు తారక్. ఇక ‘టెంపర్’ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి పదేళ్లు పూర్తయ్యింది. దీంతో అభిమానులు ఇప్పుడు ‘టెంపర్’ చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ‘కాలర్ ఎత్తి పదేళ్లు అయ్యిందని.. ఇంకా దించలేదని’ ఎన్టీఆర్ అభిమానులు గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు.