వాలంటీర్లకు హితోపదేశం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు!

పాపం వాలంటీర్ల పరిస్థితి అగ్యమగోచరంగా, అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైపోయింది. వాలంటీర్లు అందరితోనూ రాజీనామాలు చేయించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నెలాఖరులోగా మొత్తం అందరితోనూ రాజీనామాలు చేయించాలని, అసలు వాలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసేయాలన్నంత పట్టుదలగా వారు వ్యవహరిస్తున్నారు. వాలంటీర్ల మీద ఒత్తిడితెచ్చి, ప్రలోభ పెట్టి వారితో రాజీనామాలు చేయిస్తున్నారు. ఈ ఒత్తిడిని వారు తట్టుకోలేకపోతుండగా.. మరోవైపు తెలుగుదేశం పార్టీ వారు, రాజీనామాలు చేయవద్దంటూ వారికి హితోపదేశం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారికి పదివేల రూపాయల వంతున వేతనాలు వస్తాయని, అనవసరంగా రాజీనామాలు చేసి నష్టపోవద్దని వారు సూచిస్తున్నారు. ఒకవైపేమో చంద్రబాబు హామీ మీద ఆశ- నమ్మకం, మరోవైపు వైసీపీ నాయకులవైపునుంచి ఒత్తిడి మధ్య పాపం.. వాలంటీర్లు నలిగిపోతున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చినప్పుడు.. ఆ ఉద్యోగాల్లోచేరిన యువతరం సంతోషించారు. గ్రామాల్లో ఖాళీగా ఉంటున్న వారితో పాటు, వేరే ఉద్యోగాలు వచ్చేవరకు టైంపాస్ గా ఈ ఉద్యోగం చేయవచ్చునని ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ కొలువుల్లో చేరారు.  అయితే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం వెనుక జగన్ సర్కారుకు ఉన్న దుర్బుద్ధిని వారు ముందే ఊహించలేకపోయారు. ఏదో పథకాల అందజేత మాత్రమే కదా అనుకున్నారు గానీ, వైసీపీ భజనకోసం తమను వాడుకుంటారని చాలా మంది ఊహించలేదు. క్రమంగా క్లారిటీవచ్చి కొందరు తప్పుకున్నారు. కొందరు కంటిన్యూ అయ్యారు. చాలా వరకు వైసీపీ కార్యకర్తలతో ఈ వ్యవస్థ నిండిపోయింది.

తీరా ఎన్నికల సీజను వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థులు తమను పిలిచి మీటింగులు పెట్టుకుని, బోజనాలు పెట్టించి, కానుకలు, సొమ్ములు ఇచ్చి.. తమను దువ్వుతోంటే వారు మురిసిపోయారు. వారికి అనుకూల ప్రచారం చేయాలని కోరితే పోయేదేముందిలే అనుకున్నారు. కానీ.. చంద్రబాబు మీద విషం చిమ్మేలా పనిచేయాలన్నాక వారికి పరిస్థితి అర్థమైంది. అలాగే పింఛన్ల వారిద్వారా ఇవ్వకుండా ఈ రెండునెలల ఈసీ నిషేధం విధించేసరికి.. వైసీపీ పెద్దలు వీరిని పట్టించుకోవడం మానేశారు. వారికి ఫుల్ క్లారిటీ వచ్చింది. తాము కుట్రలో భాగమేనని, వైసీపీ చదరంగంలో పావులం అని అర్థమైంది. ఈలోగా.. చంద్రబాబునాయుడు తమప్రభుత్వం ఏర్పడగానే పదివేల రూపాయల వంతున వేతనాలు ఇస్తానంటూ ప్రకటన చేశారు. పార్టీతో సంబంధం లేకుండా వాలంటీర్లందరికీ ఆశ పుట్టింది. తమ కష్టాలు చంద్రబాబు గమనించారని నమ్మకం కలిగింది.

చంద్రబాబు హామీతో కంగారుపడిన వైసీపీ దళాలు, వాలంటీర్లు ఎక్కడ తెలుగుదేశానికి అనుకూలంగా మారిపోతారేమో అనే భయంతో.. వారందరితో రాజీనామాలు చేయించడం ప్రారంభించారు. రాజీనామాలు చేయించి..  ఈ జీతం తామే ఇచ్చేలా తమ వెంట ఎన్నికల ప్రచారంలో తిప్పుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలైన వారు అలా వెళుతున్నారు గానీ.. తటస్తుల మీద ఒత్తిడి పెరుగుతోంది. వారికి ఇష్టం లేకపోయినా రాజీనామాచేయమని అంటున్నారు. అదే సమయంలో.. అస్సలు రాజీనామా చేయొద్దు చంద్రబాబు ప్రభుత్వమే రాబోతోంది.. మీకు వేతనాలు పదివేలు అవుతాయి.. కోల్పోవద్దు అని తెలుగుదేశం నాయకులు వాలంటీర్లకు హితబోధ చేస్తున్నారు. తెదేపా మాటల వల్ల వారిలో ఆశ పుడుతోంది. తమకు మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం కలుగుతోంది. కానీ.. వైసీపీ వారి ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories