నిత్యానుష్ఠానం కంటె నిజం చెప్పడం పెద్ద ధర్మం సార్!

ముంబాయికి చెందిన సినీనటి కాదంబరి జత్వానీ మీద అక్రమ కేసులు నమోదు చేయించి, ఆమెను తల్లిదండ్రులతో సహా అరెస్టు చేయించి.. ఒక నిర్జన ప్రదేశంలోను, సుదీర్ఘకాలం రిమాండులోను పెట్టి.. వేధించిన దుర్మార్గమైన కేసులో కీలక నిందితుడు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ముంబాయికి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ మీద కాదంబరి జత్వానీ పెట్టిన కేసును ఉపసంహరింపజేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మాట ఇచ్చినట్టుగా ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగా జగన్ కళ్లలో ఆనందం చూడడానికి, ఆయన తరఫున సకలశాఖ మంత్రి తనకు పురమాయిస్తే.. పీఎస్సార్ ఆంజనేయులు అత్యుత్సాహంతో స్పందించి.. ఈ బాగోతం నడిపించారనేది ఆరోపణ ఎంతో సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఇప్పుడు కీలక నిందితుడిగా పోలీసు కస్టడీకి వచ్చారు. కనీసం ఇప్పుడైనా ఆయన నిజం చెబుతారా? ఆధ్యాతమ్ిక చింతన పరాయణుడైన పీఎస్సర్ ఆంజనేయులు.. తాను నమ్మే ధర్మంలో నిజం చెప్పడం అనే నైతికవిలువకు చాలా ప్రాధాన్యం ఉన్నదనే వాస్తవాన్ని గుర్తిస్తారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

ఆంజనేయులు సదాచార పరాయణులు. నిత్యానుష్ఠానం చేస్తారు. ధర్మాన్ని, దేవుడిని నమ్ముతారు. తాత్విక స్పృహ, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. ఆయన నిత్యం రెండువేళలా సంధ్యావందనం కూడా చేస్తారు. తనను పోలీసులు అరెస్టు చేసినప్పుడు కూడా.. మీరు వచ్చి అరెస్టు చేస్తారని ముందే తెలిసినప్పటికీ.. ఏది ప్రాప్తం ఉంటే అది వస్తుందనే ఉద్దేశంతో ముందస్తు బెయిలు కోసం కూడా దరఖాస్తు చేయలేదని చెప్పి.. వారిని ఆశ్చర్యానికి గురిచేసిన వ్యక్తి ఆంజనేయులు. ఆయనను జుడిషియల్ రిమాండు నిమిత్తం జైలుకు తరలించినప్పుడు.. తాను రెండువేళలా జైలులో సంధ్యావందనం చేసుకోవడానికి అనుమతి కావాలని కోరారు ఆయన. తనవెంట సంధ్యావందనం చేసే సామగ్రిని మాత్రం తీసుకువెళ్లారు. అంతటి సదాచారపరాయణుడికి, నిత్యానుష్ఠానం చేసే వ్యక్తికి నిజం చెప్పడమే సనాతన ధర్మం యొక్క మౌలిక లక్షణం అనే సంగతి తెలియదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కేవలం ప్రభుత్వ పెద్దలను సంతుష్టులను చేయడానికి పీఎస్సార్ ఆంజనేయులు అప్పట్లో అత్యుత్సాహం చూపించారు. తాను పూనుకుని ఒక స్కెచ్ సిద్ధం చేసి.. అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీలను అందులో భాగస్వాముల్ని చేశారు. ఇవాళ ఆ ఇద్దరు యువ ఐపీఎస్ లు కూడా సస్పెన్షన్ లో ఉన్నారు. ఒక మహిళ కుటుంబాన్ని పూర్తిగా తప్పుడు కేసులో ఇరికించి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి.. అన్ని రకాలుగానూ తప్పుడు పనులను తన సారథ్యంలో నడిపించారనేది పీఎస్సార్ ఆంజనేయులు మీద ఉన్న ప్రధాన ఆరోపణలు.

సనాతన ధర్మాన్ని ఇంత బలంగా ఆచరించే వ్యక్తికి తాను చేసినది పాపం అనే స్పృహ లేకుండా ఉంటుందా? అలాంటి పాపానికి సరైన ప్రాయశ్చిత్తం.. వాస్తవాలు వెల్లడించడం మాత్రమే అనే ఆలోచన పుట్టకుండా ఉంటుందా అనే సందేహం పలువురిలో ఉంది. ఆంజనేయులు నిజాలు చెప్పాలని అనుకుంటే గనుక.. ఆయన మనసు తేలికపడుతుంది. ఇన్నాళ్లూ రాజకీయంగా ఎవరికి కొమ్ముకాయడానికి ప్రయత్నించారో.. వారు మళ్లీ అధికారంలోకి వస్తే.. కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. కానీ.. ధర్మం తప్పలేదని, పాపం చేయలేదనే సంతృప్తి ముందు అవన్నీ చాలా చిన్న కష్టాలు అవుతాయి. అలాంటి మంచి వివేకవంతమైన  ఆలోచన ఆంజనేయులులో కలిగితే గనుక.. కాదంబరీ జత్వాని వేధింపుల కేసు దూదిపింజెలా చిటికెలో విడిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories