వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడానికి.. మండపాల వరకు వెళ్లాలంటే కూడా ఇష్టముండదా? ‘వానొస్తోంది’ లాంటి చవకబారు సాకులు చెప్పి.. ఎగ్గొట్టడానికి ఆయన ప్రయారిటీ ఇస్తారా? అలాగని.. హిందూదేవుళ్లకు తాను దూరం అని ప్రజలు అనుకోకుండా ఉండేందుకు .. తన తాడేపల్లి ప్యాలెస్ పార్టీ ఆఫీసులో జరిగిన పూజలో మాత్రం పాల్గొని చేతులు దులుపుకున్నారా? అంటే ఎవరైనా అవుననే అంటారు. అయితే.. ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. విజయవాడలో వినాయక చవితి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొన్న చంద్రబాబునాయుడు మాటలు.. వైసీపీ నేతలకు వణుకు పుట్టిస్తున్నట్టుగా ఉంది.
ఎందుకంటే.. ఈ ఉత్సవాల్లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘దొంగదండాలు పెట్టేవారిని వినాయకుడు క్షమించడని, వారిని తప్పకుండా శిక్షిస్తాడని’ అన్నారు. ఆయన స్ట్రెయిట్ గానే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారని అర్థం చేసుకోవచ్చు. జగన్ విజయవాడలోని ఉత్సవాల్లో పాల్గొనేలా ముందు షెడ్యూలు ప్రకటించారు గానీ.. చివరి నిమిషంలో వర్షం నెపం చూపి దానిని రద్దు చేసుకున్నారు. తన పార్టీ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలు నిర్వహించారు. రాత్రీ పగలూ తేడాలేకుండా తాను చేసిన అపరాధాలన్నీ క్షమించాలని ఆయన దేవుడిని వేడుకున్నారు. పురోహితులు.. గుంజీలు తీయాల్సిందిగా, లెంపలు వేసుకోవాల్సిందిగా ఒకవైపు చెబుతూనే ఉన్నప్పటికీ.. పట్టించుకోకుండా.. జగన్ జస్ట్ అలా దండం పెట్టుకుని చేతులు దులుపుకున్నారు. ఆ వైనంపై చంద్రబాబు సెటైర్ వేసి ఉండొచ్చు. కానీ తమను తాము సమర్థించుకోవడానికి.. జగన్ దళాలు చాలా తాపత్రయపడుతున్నాయి.
కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అంటున్నారు. నిజం చెప్పాలంటే.. కాణిపాకం ఆలయ అభివృద్ధికి జగన్ పాలనకు సంబంధమే లేదు. అవి అంతకుముందు చంద్రబాబు పాలనలోనే ప్రారంభం అయ్యాయి. జగన్ ఆ పనుల కోసం చేసిన మంజూరు ఒక్కటి కూడా లేదు. అయితే.. ఆ ఆలయం అభివృద్ధి అంతా జగన్ చేసినదే అన్నట్టుగా చెప్పడం భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
మామూలుగానే.. కాణిపాకం వినాయకుడు ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి. అక్కడ ప్రమాణం చేసి అబద్ధం చెబితే.. అక్కడితో వారి కెరీర్ అంతమవుతుందని, పతనం ప్రారంభ మవుతుందని భక్తులు నమ్ముతారు. అలా ప్రమాణాలు చేసి.. తమ అవినీతి గురించి అబద్ధాలు చెప్పిన ఉద్ధండులైన రాజకీయ నాయకుల జీవితాలు పతనమైనపోయిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అలాంటిది.. ఆ దేవుడి పేరు చెప్పి ఇంత విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పడమేంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.