తెలంగాణ లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైఎస్ షర్మిల ఫోన్లను కూడా ట్యాప్ చేసి విన్నారని, ఏపీకి చెందిన ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే సంగతులు బయటకు వచ్చిన తర్వాత.. అక్కడ ఆ ట్యాపింగ్ దందా సాగడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత? ఆయన అందించిన సహకారం ఎంత? ఆయనకు ఒనగూరిన లబ్ధి ఏంటి? అనే దిశగా ప్రజల్లో అనుమానాలు రేగాయి. తన ఫోన్లు ట్యాప్ అయిన మాట నిజం అని.. బాబాయి వైవీ సుబ్బారెడ్డి తన ఫోను సంభాషణను తనకే వినిపించారని షర్మిల ధ్రువీకరించారు కూడా. తెలంగాణలోని ట్యాపింగ్ పాపంలో వైఎస్ జగన్మోహన్ కు భాగం ఉండడం మాత్రమే కాదు.. ఏపీలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణంలో ట్యాపింగ్ నిందితుల్లో ఒకరైన శ్రవణ్ రావుకు కూడా భాగం ఉన్నట్టు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కాం పాపులు.. తాము పరారీలో ఉంటూ తలదాచుకోవడానికి ఆయనను వాడుకున్నట్టుగా కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తమాషా ఏంటంటే.. మరో కంటికి తెలిసే అవకాశం లేని ఈ వ్యవహారం శ్రవణ్ రావు చేసిన ఒక మోసం కారణంగా వెలుగులోకి రావడం. తాజాగా శ్రవణ్ రావును కూడా 22వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఏపీ సిట్ పోలీసులు నోటీసులు పంపారు.
తెలంగాణ ఫోను ట్యాపింగ్ కేసులో ఒక కీలక నిందితుడు శ్రవణ్ రావుకు దుబాయిలోని అత్యంత ఖరీదైన, బిజినెస్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో ఒక విలాసవంతమైన లగ్జరీ ఫ్లాట్ ఉంది. ఆ ప్రాంతంలో 66 అంతస్తుల్లో పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ ఉంటాయి. అందులో 1నుంచి 34 అంతస్తుల వరకు బిజినెస్ క్లాస్ హోటల్ కాగా, ఆ పై అంతస్తుల లగ్జరీ నివాస ఫ్లాట్లు ఉంటాయి. అందులో ఫ్లాట్ నెంబరు 5801 శ్రవణ్ రావు భార్య స్వాతి రావు, హైదరాబాదులోని మరో వ్యాపారవేత్త ఆకర్ష్ కృష్ణ భార్య కావ్య పేరిట ఉంది. ఆస్తిపై ఇద్దరికీ చెరిసగం వాటా ఉన్నప్పటికీ.. కావ్య దంపతుల్ని మోసం చేసి.. ఆ ఫ్లాట్ ను డీలక్స్ హాలిడే హోమ్స్ అనే సంస్థకు లీజుకు ఇస్తూ తన భార్య స్వాతి రావు పేరుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫ్లాట్ ను తన ఆధీనంలోనే పెట్టుకున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. లిక్కర్ స్కామ్ పై దృష్టి సారించిన వెంటనే నిందితులు పలువురు దుబాయి పారిపోయారు. తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బూనేటి చాణక్య, సయీఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాశ్ తదితరులు దుబాయి చేరుకున్నారు. వారంతా శ్రవణ్ రావుకు చెందిన ఇదే ఫ్లాట్ లో తలదాచుకున్నారు. ఆ సంగతి తెలిసిన ఫ్లాట్ యజమానుల్లో ఒకరైన కావ్య భర్త ఆకర్ష్ కృష్ణ ఏపీ సిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రవణ్ తన నుంచి ఈ ఫ్లాట్ ను ఎలా మోసంతో దక్కించుకున్నది తెలియజెబుతూనే.. ఆ ఫ్లాట్ లో మద్యం కేసు నిందితులు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఉన్నట్టుగా ఆధారాలను కూడా అందించారు. మద్యం స్కామ్ లో కాజేసిన సొమ్ములతో గోల్డెన్ వీసాలను కూడా ఏర్పాటుచేసుకుని దుబాయి చెక్కేసిన నిందితులు, శ్రవణ్ రావు ఫ్లాట్ తో పాటు, మరికొన్ని ఫ్లాట్ లను కూడా అద్దెకు తీసుకుని అక్కడ తలదాచుకున్నట్టుగా సిట్ పోలీసులు తేల్చారు. 22న శ్రవణ్ రావును విచారించిన తర్వాత.. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, నిందితులు తప్పించుకోజాలరని పలువురు అంచనా వేస్తున్నారు.