తుమ్మల నాగేశ్వరరావు రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు కూడా బాగా తెలిసిన సీనియర్ నాయకుడు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా, ఆయనకు ఎదురైన అనుభవం, ఆయన స్పందించిన తీరుతో ఏపీ ప్రభుత్వం పరువు పోతోంది. ‘మీ రోడ్లు మీరు మరమ్మతు చేయిస్తారా? లేదా మా తెలంగాణ నిధులతో మీ రోడ్లకు కూడా ప్యాచ్ వర్కులు చేయించమంటారా’ అంటూ ఆయన ఏపీలోని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారిని అడిగారంటే.. అక్కడి ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు? అలాంటి దుస్థితే ఇప్పుడు దాపురించింది.
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నాడు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లారు. అలా వెళ్లడానికి- రెండు రాష్ట్రాల సరిహద్దులో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఎటపాక- కన్నాయిగూడెం రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది. ఎటపాక, చింతలగూడెం, కన్నాయిగూడెం ప్రాంతాల్లో రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో గతంలో ఆర్ అండ్ బీ మంత్రిగా కూడా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అసహనానికి గురయ్యారు. అక్కడినుంచే ఏపీ ఆర్ అండ్ బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోనులో మాట్లాడారు. ఈ మార్గంలో ఏపీ పరిధిలోని 8 కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉందనే సంగతిని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ ఏర్పడ్డాక తాను ఆర్ అండ్ మంత్రిగా చేసినప్పుడే, ఎటపాక కన్నాయిగూడెం మధ్య ఈ 8 కిలోమీటర్ల రోడ్డు వేయించానని, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా మరమ్మతులు కూడా చేయించినట్టు లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఈరోడ్డు పై ప్రయాణం చాలా కష్టంగా ఉంది. మీరు చేయించలేకపోతే చెప్పండి.. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేయిస్తాం అని ఆయన సీఈతో అనడం విశేషం.
మీ రోడ్లు ఇలా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు అని కూడా తుమ్మల హెచ్చరించారంటే.. అది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరువు పోయే వ్యవహారం కాక మరేమిటి? పాపం తుమ్మల.. ఏదో తెలంగాణ ప్రాంతంలో ఓ మారుమూలగా వచ్చే రోడ్డు గురించి మాట్లాడుతున్నారు గానీ.. ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించిన రోడ్లు తప్ప.. తతిమ్మ అన్ని రోడ్లూ అధ్వానంగానే ఉన్నాయనే సంగతి ఆయనకు తెలుసో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.