వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జబ్బలు చరుచుకుని మరీ.. తన అడ్డా అని చెప్పుకునే పులివెందుల నియోజకవర్గంలో వారికి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. ఏకంగా ఐదువేల పైచిలుకు ఓట్లతో ఆమె గెలిచారు. సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన హేమంత్ రెడ్డిని ఆమె ఓడించారు. ఈ విజయంతో ఏకగ్రీవ ఎన్నికల పేరుతో.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విషయంలో కొన్ని దశాబ్దాలుగా ఒక దుర్మార్గమైన ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపిస్తున్న వైఎస్ కుటుంబానికి పరాభవం ఎదురైనట్లు అయింది. ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే.. జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలో పరాభవం తప్పదని ఈ పరిణామం చాటిచెబుతోంది.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
పులివెందుల చరిత్రలో ఇప్పటిదాకా జడ్పీటీసీ ఎన్నికలు జరగనేలేదు. ప్రతిసారీ పోటీచేయదలచుకున్న వారినందరినీ భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి ఏకగ్రీవం చేసుకుంటూ.. అదంతా తమ ఘనత కింద వైఎస్ కుటుంబం చెప్పుకుంటూ వచ్చేది. కానీ.. చరిత్రలో తొలిసారిగా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఒకరిద్దరు కాదు కదా.. ఏకంగా 11 మంది నామినేషన్లు వేయగలిగారు. అసలు జగన్ దళానికి వ్యతిరేకంగా నామినేషన్ పడడమే ఇక్కడ చాలా పెద్ద విషయం. అలాంటిది పోలీసులు పకడ్బందీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో అంతా సవ్యంగా జరిగింది. పోలింగ్ నాడు కూడా.. పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఒక్కో ఓటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిదు నుంచి పదివేల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దశాబ్దాలుగా సాగిస్తూ వచ్చిన అరాచకానికి చరమగీతం పాడుతున్నట్టుగా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఒకవైపు రెండు స్థానాలకు కూడా.. ఎన్నికలను పూర్తిగా రద్దుచేసి.. కేంద్ర రక్షణ బలగాలతో మళ్లీ నిర్వహించాలని.. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ హైకోర్టును లంచ్ మోషన్ పిటిషన్ రూపంలో ఆశ్రయించిన సమయంలోనే ఫలితాలు కూడా వెలువడ్డం విశేషమే.