చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి మహానాడును కడప జిల్లాలో జరపాలని ఇదివరకే నిర్ణయించారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోట అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించాలని నిర్ణయించింది. వైయస్ కుటుంబానికి తరతరాలుగా పులివెందుల నియోజకవర్గం తమ విధేయతను ప్రదర్శిస్తూ వస్తోంది. అంతమాత్రాన అక్కడ తెలుగుదేశానికి ఆదరణ లేదని కాదు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా సాధించిన మెజారిటీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన పెట్టని కోటగా భావించుకునే పులివెందుల నియోజకవర్గంలోనే మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గుత్తాధిపత్యానికి సవాలు విసరా,లని ఆయనలోని అహంకారానికి గొడ్డలి వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నదని సమాచారం.
సార్వత్రిక ఎన్నికలకు ముందు అటు తెలుగుదేశం- ఇటు వైసిపి రెండు పార్టీలు కూడా కొంత నాటకీయమైన ప్రకటనలతో రంగంలోకి దిగాయి. ఒకవైపు అప్పటి ముఖ్యమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వై నాట్ 175’ అంటూ కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబును ఓడించాలని పిలుపు ఇస్తూ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. అదే తరహాలో చంద్రబాబు నాయుడు కూడా ‘టార్గెట్ పులివెందుల’ అంటూ సొంత నియోజకవర్గంలో కూడా జగన్ ను ఓడించాలని పిలుపు ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఫలితాలు వెల్లడించే సమయానికి జగన్మోహన్ రెడ్డి మొహం చాటేయగా తెలుగుదేశం తాము అనుకున్న లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చింది. పులివెందులలో జగన్ మెజారిటీ కి కూడా భారీగానే గండికొట్టింది. తొలిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే అధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలుపొందారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించదలచుకోవడం సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. ఇప్పటిదాకా కడప జిల్లాలోనే ఎన్నడూ మహానాడు నిర్వహించలేదని ఈసారి అక్కడ నిర్వహిస్తే బాగుంటుందని గతంలో ప్రకటన వచ్చింది. కడప జిల్లాలో ఎక్కడ నిర్వహించి, దానిని సక్సెస్ చేసినా సరే.. ఆ జిల్లాపై వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి బాగా గండికొట్టినట్టే. అలాంటిది ఇప్పుడు తెలుగుదేశం ఏకంగా.. పులివెందులలోనే నిర్వహించాలని అనుకోవడం విశేషం. ఇది ఖచ్చితంగతా జగన్మోహన్ రెడ్డికి పెద్ద సవాలు అవుతుంది. మొత్తం కడప జిల్లాలో వైసీపీ శ్రేణులు డీలాపడేలాగా.. మహానాడు నిర్వహణ ఉంటుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.