జంపింగ్ జిలానీలపై తస్మాత్ జాగ్రత్త!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పతనమైపోయినది కనుక ఆ పార్టీ నుంచి అధికార కూటమిలోని పార్టీల్లోకి జంప్ చేయడానికి నాయకులు ఎగబడుతూ ఉండడం ఆశ్చర్యకరం కాదు. వైసీపీని వీడి రావడానికి చాలామంది నాయకులు రెడీ గానే ఉంటారు కానీ, వారిని చేర్చుకోవడంలో కూటమి పార్టీలు ఎంత విచక్షణ, సమయమనం పాటిస్తాయనేది గమనించాల్సిన సంగతి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సహా వైసిపి నాయకులు అందరూ కూడా గత అయిదేళ్లలో విచ్చలవిడిగా చెలరేగిపోతూ అవినీతి అరాచకత్వానికి తెరతీసినందు వల్ల మాత్రమే ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు అంత దారుణంగా తిరస్కరించడం జరిగింది. ఆ వాస్తవాన్ని అంగీకరించకుండా కూటమి పార్టీలు.. ‘నాయకులు వస్తున్నారు కదా’ అని ఆశపడి తమ జట్టులో కలుపుకుంటే వారి పరిస్థితి కూడా ప్రజల దృష్టిలో పలచన అవుతుంది.

గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. దళితులకు శిరోమండనం చేయించిన కేసులో తోట త్రిమూర్తులుకు ఇటీవలే జైలు శిక్ష పడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా ఆయన ప్రస్తుతం బాహ్య ప్రపంచంలో తిరగగలుగుతున్నారు. కేసులు పిటిషన్లు అప్పీళ్ళ వలన సాంకేతికంగా తప్పించుకోవచ్చు గాని, తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేయించారనే విషయంలో ఆ జిల్లాలలో దళిత వర్గాల నుంచి వ్యతిరేకతను ఎప్పటికీ తప్పించుకోలేరు. ఒకసారి కోర్టు నిర్ధారించిన తర్వాత ఆయన మీద వారిలో ఉండే వైరభావం మరింతగా పెరిగి ఉంటుంది. అలాంటి నాయకుడిని తీసుకువచ్చి తమ జట్టులో కలుపుకుంటే భారతీయ జనతా పార్టీకి ఒరిగేదేముంటుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ, నానాటికి వారి పరిస్థితి దిగజారుతూ పోతున్నది. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం తరఫున గెలిచి తర్వాత వైసీపీలో చేరిన మద్దాలి గిరి, అలాగే పొన్నూరు నుంచి వైసీపీ తరఫున గెలిచినప్పటికీ ఇటీవల ఎన్నికలలో గుంటూరు ఎంపీ బరిలో దిగి బంగపడిన కిలారి రోశయ్య రాజీనామాలు చేశారు వీరిద్దరూ తెలుగుదేశం లో గాని జనసేనలో గాని చేరుతారనే ప్రచారం ఉంది. కిలారి రోశయ్యకు జనసేనతో సాన్నిహిత్యం ఉందనే ప్రచారం కూడా నడుస్తుంది. ఇలా నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి జారిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహరచన చేయాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఆయన కోటరీలను పక్కనపెట్టి సొంత వివేచనతో పరిస్థితులను బేరీజు వేసుకోవాలని కూడా అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories