కాంట్రాక్టర్లకు టార్గెట్లు : అమరావతి ఇక పరుగులే!

ఏపీ రాజధాని అమరావతిలో.. నవనగరాల నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం మేనెల 2వ తేదీన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ పర్యటనకు మే 2వ తేదీన ప్రధాని రాగల అవకాశం ఉందని.. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందినట్టుగా చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ సహచరులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నెల మూడోవారంలో ప్రధాని రాక ఉంటుందని అనుకున్నప్పటికీ.. 25 నుంచి ఆయన కార్యక్రమాల బిజీ షెడ్యూలులో ఉండడం వలన మే2 వతేదీనాటికి ఫిక్సయినట్టు తెలుస్తోంది. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన వెంటనే.. ఇక అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుబోతున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే వివిధ రకాల పనుల్లో ప్రస్తుతం మూడువేల మంది కార్మికులు అమరావతిలో పనిచేస్తున్నారని, త్వరలోనే ప్రతిరోజూ 20 వేల మంది కార్మికులు వివిధ నిర్మాణ పనుల్లో నిమగ్నం అయిఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొకవైపు టెండర్లలో ఎల్ 1 గా నిలిచి, ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పొందిన కాంట్రాక్టర్లకు నిర్మాణానికి డెడ్ లైన్లు, టార్గెట్లు విధించబోతున్నట్టుగా కూడా మునిసిపల్ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ఒక టార్గెట్ నిర్ణయించి.. ఆ టార్గెట్ లోగా పని పూర్తయ్యేలా కాంట్రాక్టర్లను వెంటపడి పనులు పూర్తిచేయించడం, టార్గెట్ లోగా పని పూర్తిచేయలేకపోతే.. పెనాల్టీలు విధించే ఏర్పాటుతో వారిని అలర్ట్ చేయడం వలన.. అమరావతి నులు శరవేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమరావతిలో అత్యంత కీలకమైన ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కూడా టెండర్లలో ఎల్ 1 గా నిలిచిన వారికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో ఇటీవలే ఇలాంటి ఆమోద పత్రాలు పొందిన భవన నిర్మాణ పనులు అన్నింటికీ మూడు సంవత్సరాల డెడ్ లైన్ విధించినట్టుగా మంత్రి నారాయణ గతంలోనే ప్రకటించారు. అదే విధంగా.. ప్రత్యేకించి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ పనులు, మౌలికవసతుల పనులు, రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులకు ఒకటిన్నర సంవత్సరం మాత్రమే డెడ్ లైన్ విధించి టార్గెట్లు పెట్టినట్టు మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు.

ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే.. భవనాల నిర్మాణాలకు మూడేళ్లు టార్గెట్ కాగా, మౌలికవసతులకు ఒకటిన్నర ఏడాదిలోనే పూర్తిచేయాలని చెప్పడం ఆశాజనకం. ఎందుకంటే.. రోడ్లు పని వరకు పూర్తయిన వెంటనే.. మొత్తం రాజధాని ప్రాంతంలో సమాంతరంగా ప్రెవేటు భవనాలు, కార్యాలయాలు అన్నింటి నిర్మాణం ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. మౌలిక వసతులు సిద్ధం కావడం అనేది ఎన్నో రకాలుగా ఇతర నిర్మాణ పనులన్నీ ఊపందుకోవడానికి కారణంగా నిలుస్తాయి. ఇలా ప్రణాళికా బద్ధంగా పనులు చేయించినట్లయితే.. ఈ అయిదేళ్ల పదవీకాలం పూర్తయ్యేలోగా అమరావతి రాజధాని కనులముందు సాక్షాత్కరిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories