బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ మల్టీస్టారర్ సినిమా వార్ 2 చివరకు థియేటర్లలోకి వచ్చింది. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూద్దాం.
అసలు కథ ఏంటంటే..
కథలోకి వస్తే, రా ఏజెన్సీకి చెందిన ప్రతిభావంతుడు కబీర్ (హృతిక్ రోషన్) ఒక దశలో కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి కొన్ని దేశాలు కలిసి ‘కలి’ అనే ప్రణాళికతో భారత్‌పై దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తాయి. ఆ మిషన్‌ను కబీర్‌కి అప్పగిస్తారు. కానీ దేశానికి నిజమైన ప్రేమ కలిగిన అతను ఈ పరిస్థితిలో ఎలా వ్యవహరించాడనేది ఆసక్తికరం. కబీర్‌ను అడ్డుకునేందుకు విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత విక్రమ్, కబీర్ మధ్య ఎలా సంఘర్షణ జరిగింది, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి, కలి మిషన్‌ని ఎవరు అడ్డుకున్నారు, వింగ్ కమాండర్ కావ్య లుత్ర (కియారా అద్వానీ) పాత్ర ఏ దశలో కీలకమైంది అన్నది పెద్ద తెరపై చూడాల్సిందే.
యాక్షన్ సీక్వెన్స్
సినిమా ప్రారంభం నుంచే వేగంగా నడుస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి ఫైట్ సీన్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించారు. టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా కనిపిస్తాయి. యాక్షన్‌తో పాటు అనూహ్యమైన ట్విస్ట్‌లు, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ తమ పాత్రల్లో సూపర్‌గా నటించారు. హృతిక్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తే, ఎన్టీఆర్ ఇంటెన్స్ నటన, అటిట్యూడ్ ప్రత్యేకంగా నిలిచాయి. జై లవకుశలోని రావణ పాత్రలో కనిపించిన ఆరా, టెంపర్‌లోని దయా లాంటి బాడీ లాంగ్వేజ్ ఇక్కడ కూడా కనిపించడంతో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇద్దరి మధ్య ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
దేశభక్తి అంశం
కియారా తన పాత్ర పరిమితమైనా బాగా చేసిందని చెప్పాలి. అసుతోష్ రానా, అనిల్ కపూర్ కూడా తమ పాత్రల్లో సరైన ఇంపాక్ట్ చూపించారు. అయితే సినిమాలో కొన్ని లోపాలు లేకపోలేదు. కథలో దేశభక్తి అంశం మరింత బలంగా చూపించి ఉంటే ఇంపాక్ట్ పెరిగేది. ప్రధాన విలన్ కనిపించకపోవడం వల్ల ఘర్షణకు పెద్ద ఎత్తున ఇన్‌టెన్సిటీ రాలేదు. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగి కథనం కొంత మామూలుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ పాత్రను మరింత వైవిధ్యంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే రెండో భాగంలోని ఒక యాక్షన్ సీన్ లాజిక్ లేకుండా కనిపించడం కొంచెం నిరుత్సాహం కలిగిస్తుంది.
టెక్నికల్ పరంగా..
టెక్నికల్ పరంగా యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రీతమ్ సంగీతం కూడా యాక్షన్ సీన్స్‌కు సరైన బలం ఇచ్చింది. ఎడిటింగ్ మాత్రం కొన్ని చోట్ల తేలిపోయింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ కథనాన్ని వేగంగా నడిపించినా, రెండో భాగంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే ఫలితం ఇంకా బెటర్ అయ్యేది. ఎన్టీఆర్ పాత్రను తెలుగు ప్రేక్షకుల రుచి దృష్టిలో ఉంచి డిజైన్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది.
మొత్తం మీద వార్ 2 రెండు ఇండస్ట్రీల అభిమానులకు ఒక ఎంటర్టైనింగ్ యాక్షన్ ప్యాకేజీగా నిలుస్తుంది. లాజిక్‌పై పెద్దగా ఆలోచించకుండా ఎన్టీఆర్, హృతిక్‌ల హోరాహోరీ యాక్షన్ చూడాలని అనుకునే వారికి ఇది మంచి మాస్ ట్రీట్ అవుతుంది.