తన సొంత మండలంలో కూడా పార్టీకి ఓటమి తప్పదని అర్థమైన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముందే అలర్ట్ అయ్యారు. సాధారణంగా నాయకులు ఎక్కడైనా సరే.. ఎన్నికలు జరిగినప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత తమ అసంతృప్తిని తెలియజేస్తారు. ఆ ఎన్నికలు జరిగిన తీరును ఖండిస్తారు. కానీ.. ముందే అలర్ట్ అయిన జగన్.. కౌంటింగ్ వరకు ఆగకుండా.. ముందురోజే ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో నోరు జారడం వలన రెండు వివాదాలలో జగన్ చిక్కుకున్నారు. వాటినుంచి నష్టనివారణ చేపట్టడం ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారింది. మహా అహంభావి అయిన జగన్మోహన్ రెడ్డి.. తన దుడుకు వ్యాఖ్యల వలన జరిగిన నష్టాన్ని దిద్దుకునే ప్రయత్నంలో లేరు. తాను మాట్లాడిందే వేదం అని, తాను మాట్లాడిందే కరెక్టు అని రాష్ట్రప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం రాష్ట్రంలో ఉన్న అందరు పార్టీ నాయకుల్ని కూడా తన మాటలను సమర్థిస్తూ ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి హుకుం జారీ అయినట్టుగా కనిపిస్తోంది.
జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ముందురోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. తన అక్కసునంతా వెళ్లగక్కారు. ఆ క్రమంలో చంద్రబాబు గురించి ఆయన అత్యంత చవకబారు ఆరోపణలు చేశారు. చంద్రబాబు వయసు మీరిపోయారని, ఆయనకు బహుశా ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, ఆయన డైరక్టుగా నరకానికే వెళతారని జగన్ వ్యాఖ్యానించారు.
అలాగే.. రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. రాహుల్ ఒకవైపు ఓట్ల చోరీ అంటూ రాహుల్ పోరాటం సాగిస్తుండగా.. ఏపీలో పోలింగ్ తర్వాత పెరిగిన 42 లక్షల ఓట్ల గురించి రాహుల్ మాట్లాడడం లేదని, ఎందుకంటే ఆయన చంద్రబాబుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ రెండు వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. నష్టనివారణ దిశగా జగన్ ఏదైనా దిద్దుబాటు మాటలు చెప్పి ఉంటే సరిపోయేది. కానీ ఆయన అలా చేయకుండా.. రాష్ట్రంలో తన పార్టీలోమిగిలిఉన్న నాయకులందరినీ.. ఈ వ్యాఖ్యలు సమర్థించాల్సిందిగా పురమాయించారు. పలుచోట్ల వైసీపీ వారు ప్రెస్ మీట్ పెట్టి.. ‘జగన్ చెప్పింది నిజమే కదా. చంద్రబాబుకు వయసు అయిపోయింది కదా.. ఆయనకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు కదా..’ అని రకరకాలుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాహుల్ విషయంలో కూడా జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. చంద్రబాబు చావును కోరుకుంటున్నట్టుగా తన మనసులోని కోరిక మాటల్లో బయటకు రావడంతో.. పరువుపోయిందని జగన్ భయపడ్డారు. అయితే.. అదే కరెక్టు అని అందరితోనూ చెప్పిస్తే.. తనకు పరువునష్టం కొంత తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన తప్పుడు మాటలను సమర్థించడం మొత్తంగా అందరు నాయకుల పరువు పోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.