జగన్ మీద ప్రమాణం చేస్తే చాలట.. ఓకేనా విజయసాయీ!

తమ పార్టీని వదలిపెట్టి.. ప్రత్యర్థి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిమీద నిందలు వేయడం పరిపాటి. అదే తమ పార్టీలోనే ఉన్నంతకాలమూ, వారితో టర్మ్స్ బాగున్నంత కాలమూ నెత్తిన పెట్టుకుంటూనే ఉంటారు. అదే క్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడి మీద బురద చల్లడానికి, నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తే  ఆయన మాత్రం చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అవినీతి విషయంలో నేను కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తా.. నువ్వు కాణిపాకం రావాల్సిన అవసరం లేదు.. కనీసం జగన్ మీద ప్రమాణం చేయగలవా? అని సవాలు విసిరారు. మరి విజయసాయిరెడ్డి ఈ సవాలును స్వీకరించే స్థితిలో ఉన్నారా?

ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మొన్నమొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెసులోనే ఉన్నారు. టికెట్ల కేటాయింపు పరిణామాల తర్వాత.. ఆయన ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు.

సహజంగానే వైసీపీ వర్గాల్లో అసహనం పెరిగింది. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం నుంచి ఏడు కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారారంటూ ఆరోపణలు గుప్పించారు. వీటిపై ఆగ్రహించిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి విజయసాయిరెడ్డి ఘాటైన కౌంటర్లు ఇవ్వడం విశేషం.

ముప్పయ్యేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్లు నిరూపించగలవా? అని సవాలు విసిరారు. తాను అవినీతికి పాల్పడలేదని తాను కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని.. అదే సమయంలో విజయసాయిరెడ్డి తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని జగన్ మీద ప్రమాణం చేస్తే చాలునని వంటేరు సవాలు విసిరారు.


కాణిపాకం వినాయక ఆలయం అనేది ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం. అక్కడ ప్రమాణంచేసి అబద్ధాలు చెప్పిన నాయకుల రాజకీయ జీవితాలు సర్వనాశనం అయిపోయిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.


నాయకులందరూ కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పడు.. ప్రత్యర్థులకు ఇదే సవాలు విసురుతుంటారు. ‘రా ఇద్దరం కాణిపాకం వెళ్లి ప్రమాణం చేద్దాం’ అని సవాళ్లు విసురుతూ ఉంటారు. సవాళ్లు వినిపిస్తాయే తప్ప.. ఇటీవలి కాలంలో అక్కడకు వచ్చి సాహసించి ప్రమాణం చేసిన నాయకుడు లేనేలేడు. కానీ వంటేరు వేణుగోపాల్ రెడ్డి వెరైటీగా తాను కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమేనని, విజయసాయి అందుకు బదులుగా జగన్ మీద ప్రమాణం చేస్తే చాలునని అంటున్నారు. జగన్ మీద ప్రమాణం చేయడానికి విజయసాయి సిద్ధమేనా? లేదా, జగన్ మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెబితే.. జగన్ రాజకీయ జీవితం నాశనం అయిపోతుందనే భయం విజయసాయిని వెన్నాడుతుందా అనేది చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories