జగన్మోహన్ రెడ్డి వాలకం గమనిస్తే.. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎవరు హత్యకు గురవుతారా? రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరుగుతాయా? అని కాచుకుని కూచున్నట్లుగా ఉంది! ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు గురికాగానే దానిని రాద్ధాంతం చేయడానికి, రాజకీయంగా ఎడ్వాంటేజీ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని మళ్లీ జాతీయస్థాయిలో దేశం మొత్తం దృష్టికి తీసుకువెళ్తానని జగన్ అంటున్నారు. చూడబోతే.. మళ్లీ ఢిల్లీలో ఇంకోసారి ధర్నా నిర్వహించి.. మళ్లీ ఇతర రాష్ట్ర నాయకులు ఎవరినైనా బతిమాలి పిలుచుకుని.. బిల్డప్ ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇది రాజకీయ హత్య అనేది వైసీపీ ఆరోపణ. పోలీసులకు ముందే ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని కూడా పార్టీ ఆరోపిస్తోంది. జగన్ విహారయాత్రార్థం బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లి ఉన్న సమయంలో ఇది జరిగింది. నవాబుపేటలో ఘర్షణలు కూడా జరిగాయి. జగన్ ఉన్నపళంగా వచ్చేశారు. ఇలాంటి ఘర్షణలు, హత్యలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా? అని ఎదురుచూస్తున్నట్టుగా జగన్ వాలిపోయారు. 9వ తేదీన పరామర్శ నిమిత్తం వెళ్లనున్నారు.
నవాబుపేట ఘర్షణల బాధితుల్ని మాత్రం ఆల్రెడీ పరామర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చెవిలో తమ కోరికను వెల్లడించారేమో తెలియదు.
ఇటీవలి జరిగిన ఒక వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగుపులిమి ఢిల్లీ లెవెల్లో ధర్నా చేసినందుకే జగన్ జాతీయ మీడియా దృష్టిలో పలుచన అయిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత 36 మంది వైసీపీ కార్యకర్తల్ని హత్య చేశారంటూ నిరాధార ఆరోపణలు చేసి తన పరువు తానే తీసుకున్నారు జగన్. ఆ 36 మంది పేర్లు చెప్పమని ప్రభుత్వంలోని వారు పదేపదే అడుగుతోంటే పెదవి విప్పకుండా జారుకుంటున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో ఒక హత్య జరగడంతో దీని ద్వారా రాజకీయ లబ్ధికోసం మళ్లీ దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారు. జగన్ లేకి రాజకీయాలను ఆ పార్టీ వారే అసహ్యించుకుంటూ ఉండడం విశేషం.