తిరుమల వేంకటేశ్వరస్వామి వారి మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయాలనే ఆలోచన రావడమే ద్రోహం. కేవలం అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం.. కోట్లమంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూను కల్తీ నెయ్యితో భ్రష్టు పట్టించడం చాలా దుర్మార్గమైన పని. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలోనే ఇలాంటి స్వామిద్రోహం చోటుచేసుకుంది. కోట్లాదిమంది భక్తులు ఖిన్నులయ్యారు. మొత్తానికి ఈ వ్యవహారంలో పాత్రధారులైన కల్తీ నెయ్యి సరఫరాదారుల్ని ప్రత్యేకదర్యాప్తు బృందం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్వారా అందుతున్న వివరాలను బట్టి.. తెరవెనుక సూత్రధారుల్ని కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
కల్తీనెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో అసలు నిందితులు భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ యజమానులు ఇద్దరు, శ్రీకాళహస్తి సమీపంలోని వైష్ణవి డెయిరీ యజమాని, తమిళనాడులోని ఏఆర్ డెయిరీ యజమానులను అరెస్టుచేసి ప్రస్తుతానికి రిమాండులో ఉంచారు. వీరిలో ఏఆర్ఱ డెయిరీ పేరు మీద మాత్రమే కాంట్రాక్టు ఉండగా.. కల్తీకి కేంద్రబిందువులు అయిన ఇతర డెయిరీలనుంచి నెయ్యి సరఫరా అయింది. వీరిని పదిరోజుల పాటు విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా.. పోలీసులు అడుగుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే.. ఈ అక్రమాలకు బీజం పడినట్టుగా ప్రాథమికంగా వార్తలు వస్తున్నాయి. అప్పటికే నాణ్యమైన నెయ్యిని సరఫరా చేస్తున్న కర్ణాటకలోని ఒక డెయిరీని పక్కకు తప్పించి.. ఏఆర్ డెయిరీకి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక.. వైసీపీ జమానాలోని ధర్మకర్తలమండలిలో కొందరు పెద్దలు కీలక భూమిక పోషించినట్టుగా సిట్ పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఇప్పుడు వారి పాత్ర గురించి మరిన్ని ఆధారాలు సేకరించి.. వారిని అరెస్టు చేసే ప్రయత్నంలో ఉన్నారు.
లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, ఇతర వ్యర్థాలు కల్తీ అయినట్టుగా గుర్తించిన తర్వాత.. చాలా పెద్ద రాద్ధాంతమే జరిగింది. వైసీపీ పాలనలోని టీటీడీ ధర్మకర్తల మండలి వారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ అయిదేళ్ల కాలంలో చివరి విడత టీటీడీ ఛైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేసి.. నెయ్యి కల్తీ విషయంలో తెలిసో తెలియకో తన పాత్ర ఉండి ఉంటే.. తాను తన కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతాం అని ప్రమాణం చేశారు. అదే సమయంలో.. ఆయనకు ముందు నాలుగేళ్లపాటు ఛైర్మన్ పదవిని అనుభవించిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం వేసిన సిట్ పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం మార్గదర్శకత్వంలో సీబీఐ డైరక్టర్ సారథ్యంలో వేరే సిట్ ఏర్పాటు అయింది. ఆ సిట్ ఇప్పుడు అరెస్టుల వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
వైవీసుబ్బారెడ్డి పాలన కాలంలోనే ఈ అక్రమాలు జరిగినట్టుగా దాదాపుగా ధ్రువపడుతోంది. అయితే.. ఆయనకు స్వయంగా ఈ పాపాల్లో భాగముందా… ఆయన అండతో అప్పటి ఇతర బోర్డు సభ్యులు మాత్రమే.. నెయ్యి కల్తీకి బాధ్యులా అనేది త్వరలోనే తేలుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.