జగన్ ప్రభుత్వం హయాంలో అడ్డగోలుగా చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారుల్లో సునీల్ కుమార్ కూడా ఒకరు. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా, దానికి తోడు అనేక అడ్డదారులు తొక్కినట్టుగా సునీల్ కుమార్ మీద ఆరోపణలున్నాయి. సీఐడీ చీఫ్ హోదాలోకి వచ్చి.. జగన్ కోసం అనేక మందిని విచ్చలవిడిగా వేధించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అన్ని చేసినా కూడా జగన్ ఆగ్రహానికి గురై లూప్ లైన్లోకి కూడా వెళ్లారు. ప్రభుత్వం మారిన తర్వాత.. ఆయన మీద అనేక కేసులు కూడా నమోదై ఉన్నాయి. అలాంటి సునీల్ కుమార్ మీద ప్రభుత్వం ఎట్టకేలకు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే సునీల్ కుమార్ అనేక వివాదాస్పద కేసుల్లో కీలక వ్యక్తి, నిందితుడు కాగా.. అవన్నీ పక్కకు పోయి మరో వ్యవహారంలో ఆయన సస్పెండ్ కావడం విశేషం.
ప్రస్తుతం డిప్యూటీ స్పీకరుగా ఉన్న రఘురామక్రిష్ణ రాజు.. గతంలో జగన్ పాలన సాగిన రోజుల్లో సీఐడీ తనను అరెస్టు చేసినప్పుడు, కస్టడీలో తనను
హత్య చేయడానికి ప్రయత్నించారని కేసు పెట్టారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతూ ఉంది. రఘురామను అప్పట్లో కస్టడీలో హింసించిన అధికార్లను ఇప్పుడు పోలీసులు ఒక్కరొక్కరుగా విచారిస్తున్నారు. తనను హత్య చేయించడానికి అసలు కుట్ర చేసినది జగన్మోహన్ రెడ్డి కాగా, కీలక పాత్రధారి అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అనేది రఘురామ ఆరోపణ. సునీల్ కుమార్ ను ఇప్పటిదాకా విచారణకు ఎందుకు పిలవలేదని, ఆయనను ఇప్పటిదాకా సస్పెండ్ చేయకుండా సర్వీసులో ఉంచడమే చిత్రంగా కనిపిస్తోందని.. రఘురామ పలుమార్లు ఆరోపించారు కూడా. నిజానికి రఘురామ కేసులో విచారించడానికి వీలుగా సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తారనే ఊహాగానాలు కూడా సాగుతూ వచ్చాయి. అయితే అనేక పాపాలకు పాల్పడిన వారిని ఏదో ఒకటి ఖచ్చితంగా వెన్నాడి తీరుతుంది. అదే తీరులో.. సునీల్ కుమార్ మరో కేసు విషయంలో ఇప్పుడు సస్నెన్షన్ కు గురయ్యారు.
2019 నంుచి 2024 మధ్య కాలంలో ఆయన పలుమార్లు ప్రభుత్వ అనుమతి లేకుండానే.. విదేశీ యాత్రలకు వెళ్లినట్టుగా ఆయన మీద అభియోగాలున్నాయి. అనుమతిలేని పర్యటనలతో పాటు, అనుమతి తీసుకున్న సందర్భాల్లో కూడా ట్రావెల్ ప్లాన్ లకు విరుద్ధంగా ఆయన విదేశఆల్లో గడిపినట్టుగా కేసులు నమోదు అయ్యాయి. ప్రాథమిక విచారణలో ఆ ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో.. ఆయనను సస్పెండ్ చేశారు.
రఘురామ కేసు కోసమే సస్పెండ్ చేసి ఉన్నట్టయితే.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ప్రభుత్వం మీద వైసీపీ దళాలు బురద చల్లడానికి అవకాశం ఉండేది. అలా కాకుండా.. ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి విచ్చలవిడిగా విదేశీ యాత్రలు తిరగడం గురించి సస్పెండ్ చేయడం గమనార్హం. దీనివల్ల.. అప్పటి జగన్ ప్రభుత్వపు చేతగానితనం కూడా బయటపడుతుంది. కానీ.. సునీల్ కుమార్ సస్పెన్షన్ తరువాత.. రఘురామ కేసులో విచారణ కూడా వేగం పుంజుకుంటందని, సునీల్ ను కూడా విచారణకు పిలుస్తారని అంచనా వేస్తున్నారు.